Telugu Gateway
Politics

న్యూలుక్ లో రాహుల్ గాంధీ...కరోనాపై ప్రెస్ మీట్

న్యూలుక్ లో రాహుల్ గాంధీ...కరోనాపై ప్రెస్ మీట్
X

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూలుక్ లో మీడియా ముందుకు వచ్చారు. ఆయన అచ్చం రాజీవ్ గాంధీలాగా కన్పించారు. రాహుల్ పాత లుక్ కు ఇప్పటి లుక్ చూస్తే హెయిర్ స్టైల్ మార్చినట్లు కన్పిస్తోంది. చాలా రోజుల తర్వాత ఆయన కరోనా అంశంపై మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా సమస్యను అధిగమించేందుకు రాజకీయ పార్టీలు అన్నీ కలసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను రాజకీయ విమర్శలు చేయటానికి రాలేదని..ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేస్తున్నానని వ్యాఖ్యానించారు. కరోనా నివారణకు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదన్నారు. రాష్ట్రాలను ఉదారంగా ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా వలస కూలీలు, కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని..వీరందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ప్రజలతోపాటూ అన్నీ పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.కరోనా పై పోరాటానికి వైద్య పరీక్షలు భారీగా పెంచాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోందని, కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలని సూచించారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకోవాలని, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. లాక్ డౌన్ లో చిక్కుకు పోయిన వారికి ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులపై కూడా ఇప్పటికే ఓ వ్యూహం రూపొందించుకుని ఉండాలన్నారు.

Next Story
Share it