Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అనుమానాలెన్నో!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అనుమానాలెన్నో!
X

ఏపీ మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తీరుపై ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్వయంగా తన లేఖ వివాదంపై క్రిమినల్ విచారణ అవసరం లేదంటూ ఏకంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాయటంతో ఆయనపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. అంతే కాదు..సడన్ గా రమేష్ కుమార్ బుధవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసి కేంద్ర హోం శాఖకు లేఖ తానే రాశానని...ఇందులో బయటి వ్యక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పందించారు. వాస్తవానికి ఈ లేఖ వివాదం తలెత్తినప్పుడు వైసీపీ నేతలు రమేష్ కుమార్ స్పందించాల్సిందిగా పదే పదే డిమాండ్ చేశారు. ఆ క్రమంలో కొంత మంది అభ్యంతరకర వ్యాఖ్యలు చూశారు. ఎంత మంది ఎంత దారుణంగా దూషించినా లేఖపై స్పందించని రమేష్ కుమార్..ఇన్ని రోజుల తర్వాత లేఖ తానే రాసినట్లు ఒప్పుకోవటం వెనక కారణాలు ఏంటి?. అందునా కేంద్ర హోం శాఖ మంత్రి సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా రమేష్ కుమార్ లేఖను ధృవీకరించారు కూడా. దీంతో చాలా వరకూ క్లారిటీ వచ్చేసినట్లు అయింది.

ఇన్ని రోజులుగా ఎప్పుడూ స్పందించని రమేష్ కుమార్..తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ ఫోర్జరీదని..దీనిపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేయటంతోనే రమేష్ కుమార్ బయటకు రావటం ఒక షాకింగ్ పరిణామం అయితే..విజయసాయిరెడ్డి లేఖపై విచారణ అవసరరం లేదని డీజీపీకి లేఖ రాయటంతో రమేష్ కుమార్ పై అనుమానాలు మరింత బలపడ్డాయి. రమేష్ కుమార్ చెప్పినట్లు నిజంగా ఆయనే సంతకం పెట్టి లేఖ రాసినట్లు అయితే..ఏ విచారణ జరిగితే రమేష్ కుమార్ కు ఏమవుతుంది?. ఎందుకు ఆయన ఆకస్మాత్తుగా తెరపైకి వచ్చి తానే లేఖ రాసినప్పుడు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది?. అది కాకుండా డీజీపీకి లేఖ రాయాల్సి వచ్చింది అన్నవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. వాస్తవానికి ఈ లేఖపై వైసీపీ ఎమ్మెల్యేల బృందం ఒకటి వెళ్లి ఎప్పుడో డీజీపికి ఫిర్యాదు చేసింది కూడా. కానీ ఆ ఫిర్యాదుపై చర్యలు...పురోగతి ఏమిటో ఎవరికీ తెలియదు.

కానీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి అటు కేంద్రానికి..ఇటు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయటంతో వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు అయింది. కరోనా కారణంగా అప్పటి ఎస్ఈసీ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకుని అధికార వైసీపీ నేతలు ఈ వాయిదా నిర్ణయంపై అసాధార స్థాయిలో విమర్శలు చేశారు. కానీ ఆ తర్వాత ఏపీలో కరోనా వైరస్ విస్తృతి ఆయన వాయిదా నిర్ణయం సబబే అని నిరూపించింది. అయితే రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో వాడిన భాష, పదజాలం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు విచారణ అవసరం లేదంటూ ఆయన ముందుకు రావటంతో తెర వెనక ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it