రోజాపై ప్రశంసలు..సర్కారుపై విమర్శలు..సస్పెన్షన్

ఆయన మునిసిపల్ కమిషనర్. ఎమ్మెల్యే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళ అయినా కూడా నగరిలో ఆమె కరోనాపై పోరులో ముందున్నారని..ఆమె ఒక్కరే ప్రజల తరపున నిలబడ్డారని ప్రశంసించారు. కానీ సర్కారు మాత్రం ఎలాంటి సాయం చేయకపోగా..అన్ని ఖాతాలను ప్రీజ్ చేసిందని...కనీసం మాస్క్ లు..గ్లౌజ్ లు ఏమీ ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. అంతే కాదు....స్థానికంగా ఉన్న కొంత మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను కూడా ఆయన టార్గెట్ చేశారు. నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సర్కారు ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జార చేశారు.
కరోనా నివారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయంటూ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు నగరి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నివారణ విషయంలో సర్కారు తీరును తప్పుపడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితమే నర్సీపట్నానికి చెందిన ఓ డాక్టర్ కూడా సర్కారు అసలు ఆస్పత్రులకు, వైద్యులకు సరైన సౌకర్యాలు కల్పించటం లేదని విమర్శించారు. ఆయన్ను కూడా సర్కారు సస్పెండ్ చేసింది. ఇఫ్పుడు నగర మునిసిపల్ కమిషనర్ వంతు అయింది. ప్రభుత్వ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.