Telugu Gateway
Telangana

హరీష్ రావుపై కెటీఆర్ ప్రశంసలు

హరీష్ రావుపై కెటీఆర్ ప్రశంసలు
X

రంగనాయక సాగర్ తో సిద్ధిపేటకు గోదావరి జలాలు

సిద్ధిపేటకు గోదావరి జలాలు వచ్చాయి. రంగనాయకసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కెటీఆర్ లు శుక్రవారం నాడు ప్రారంభించారు. 2300 ఎకరాల్లో 3300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు సామర్ధ్యం మూడు టీఎంసీలు. ఈ ప్రాజెక్టు సిద్ధం కావటంతో సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మరో మంత్రి కెటీఆర్ ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి విషయంలో సీఎం కెసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా హరీష్ రావు ఎంతో శ్రమించారన్నారు. కోటి ఎకరాల మాగాణి సాధనలో హరీష్ రావు క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగు నీరు అందుతుందని తెలిపారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధిపేటకు నీళ్లు తేవటం అనేది దశాబ్దాల కల అని..అది ఇప్పటికి నెరవేరిందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలంగాణ దేశానికి మార్గనిర్దేశం చేసిందని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో మెదక్ జిల్లాకు తప్ప ఒక్క ఎకరానికి కూడా సాగునీరు రాలేదన్నారు. ఇప్పుడు కాలువపై వ్యవసాయం చేసే అదృష్టం సిద్ధిపేట జిల్లా రైతులకు వచ్చిందని తెలిపారు. త్వరలో సిద్ధిపేటకు రైలు తీసుకొచ్చి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు.

Next Story
Share it