ఏపీ కిట్ల వ్యవహారంపై విచారణ

స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి..మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు లేఖ రాశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైసీపీ సర్కారు ఈ ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అంతే కాదు కరోనా టెస్ట్ కిట్ల వ్యవహారాన్ని కూడా ఆయన మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా చేసిన అవినీతిపై విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా పేరుతో ర్యాపిడ్ కొనుగోలులో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టాన్ని కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఏపీ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని విస్మరించి తక్షణ సేకరణ అనే సాకుతో కొంత ఆర్థిక ప్రయోజనం పొందటానికి మధ్యవర్తి ద్వారా కిట్ల కొనుగోలు చేసిందని కన్నా లేఖలో తెలిపారు. కిట్ల కొనుగోళ్లలో మధ్యవర్తిని తీసుకురావడం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో దాని ప్రాముఖ్యత దృష్ట్యా మొత్తం లావాదేవీలను పరిశీలించమని కోరారు.