Telugu Gateway
Andhra Pradesh

ఊహించని కష్ట కాలం ఇది

ఊహించని కష్ట కాలం ఇది
X

“ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజల పక్షాన మాట్లాడదాం. ప్రస్తుతం లాక్ డౌన్ పొడిగింపులో మనందరం ఉన్నాం. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండ్ల తోటల రైతుల సమస్యలు ప్రస్తావనకు వస్తున్నాయి. అరటి పంట కొనుగోలు, విక్రయాలలో ఉన్న రైతుల సమస్యలు, ఆందోళనలు నా దృష్టికి వచ్చాయి. గోదావరి జిల్లాల్లోనూ ఈ పంటను అమ్మే సమయం ఇది. అక్కడికి కడప నుంచి తీసుకొచ్చి అరటి విక్రయిస్తుంటే స్థానికంగా ఉన్న పంటను అమ్ముకోవడం ఎలా అనే ఆందోళనలో రైతులు ఉన్నారనే విషయం నా దృష్టికి చేరింది.’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం నాడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజు కూలీలు, చిరు వ్యాపారులు, పేదల కష్టనష్టాల గురించి దృష్టి సారించి తప్పకుండా మాట్లాడదాం.

రైతులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పేదలు, మహిళలు ఈ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ కార్యాలయానికి తెలియచేయండి. ఈ సమావేశంలో జనసేన పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ‘కరోనా వైరస్ విస్తృతి వేగంగా ఉంది. రాష్ట్రంలో 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్స్ గా ప్రకటించింది. కరోనా జోన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మండలాలను యూనిట్ గా తీసుకోవాలనుకొంది. అయితే కేంద్రం జిల్లాలను ప్రకటించింది. ఇరుగుపొరుగున ఉన్న ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని లాక్ డౌన్ పొడిగింపునకు సిద్ధమయ్యాయి. ఇక్కడ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. జిల్లాల్లో కేసుల ప్రకటన విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యక్రమాల కోసం కేసులు దాచిపెట్టేలా వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 20వ తేదీ తరవాత కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు. పట్టణ ప్రాంతాల్లో జాగ్రత్తగానే ఉండాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అందులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ద్వారా మన పార్టీ నుంచి కూడా కొన్ని విషయాలు హైకోర్టుకు తెలియచేశాం. నామినేషన్ దశలో అడ్డుకోవడం, దౌర్జన్యాలు చేయడం, దాడులు గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాం. తెలుగు మాధ్యమంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగ్గది. తెలుగు మాధ్యమం గురించి మన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తొలి నుంచి బలంగా మాట్లాడుతున్నారు. తిరుపతి, రాజమండ్రిల్లో భాషా పండితులతో సదస్సులు నిర్వహించారు. ఎంతో భావోద్వేగమైన అంశమిది. భాషాభిమానంతో తెలుగు మాధ్యమం కోసం ఎంతో చిత్తశుద్ధితో మాట్లాడిన మన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి ఈ సందర్భంగా అభినందనలు. భాష, పర్యావరణ పరిరక్షణకు మన నుడి – మన నది కార్యక్రమం చేపట్టారు” అన్నారు.

Next Story
Share it