Telugu Gateway
Andhra Pradesh

అమెరికా వెళ్ళాల్సిన కిట్లను ఏపీకి తెచ్చాం

అమెరికా వెళ్ళాల్సిన కిట్లను ఏపీకి తెచ్చాం
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కరోనా అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలు..కిట్ల పనితీరు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా వైద్య శాఖ అదికారులు మాట్లాడుతూ ఏపీకి కూడా రాజస్థాన్‌ తరహా చైనా కిట్స్‌ ను విక్రయించేందుకు సంబంధిత వ్యక్తులు ముందుకు వచ్చారని అధికారులు జగన్ కు వివరించారు. కొన్ని కిట్లను చెక్‌చేసి చూశామని, ఇదివరకే పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను, నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను ఆ కిట్స్‌ ద్వారా పరీక్షిస్తే ఫలితాలు సంతృప్తి కరంగాలేనందున కొనుగోలులో ముందుకు వెళ్లలేదని సీఎంకు తెలిపిన అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్టు కిట్లను కొరియా నుంచి తెప్పించుకున్నామన్నారు.

అమెరికాకు వెళ్లాల్సిన ఈ కిట్లను.. అతి కష్టమ్మీద చార్టర్‌ విమానం ద్వారా తెప్పించుకున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికి 5–6వేల శాంపిళ్లను పరిశీలించామని, మంచి పనితీరు కనబరుస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకూ 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడించారు. ప్రతి పదిలక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. 809 పరీక్షలతో రాజస్థాన్‌ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఐసీయూ బెడ్లను పెంచాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనే ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని సూచించారు.

Next Story
Share it