Telugu Gateway
Andhra Pradesh

అండగా నిలుద్దాం...ఇది ఊహించని విపత్తు

అండగా నిలుద్దాం...ఇది ఊహించని విపత్తు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది జీవితంలో ఎన్నడూ ఊహించని విపత్తు అని..అందరం సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఈ తరుణంలో వీలైనంత మేరకు ప్రజలకు అవసరమైన సాయం చేయడమే ముఖ్యం.. అందుకే సంయమనంతో సున్నితంగా స్పందిస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆయా జిల్లాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. మన నాయకులు, శ్రేణులు రైతాంగం, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియచేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఆటోమొబైల్ రంగం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆ రంగం మీద ఆధారపడ్డ కార్మికులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారు.

చిరు వ్యాపారులు రుణాలు తీసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ సమస్యలన్నిటిపై సమగ్ర రీతిలో ప్రభుత్వానికి తెలియచేస్తాం. జన సైనికులు తమ సేవా కార్యక్రమాలతో నిరూపిస్తున్నారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చినవారు సైతం పెద్ద మనసుతో సాటివారిని ఆదుకొంటున్నారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. కష్ట కాలంలో ఆదుకొనే మంచి మనసు మీకు ఉంది. సేవా కార్యక్రమాలు చేస్తున్నవారందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను” అన్నారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ కరోనా వ్యాధి తీవ్రతపై ప్రభుత్వం తగిన రీతిలో సత్వరం స్పందించలేదు.

ముఖ్యమంత్రి విధానం కారణం. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. గుంటూరు, విజయవాడ నగరాల్లో రెడ్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నరసరావుపేట, పొన్నూరుల్లోనూ రెడ్ జోన్స్ పెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకొంటున్న నిర్ణయాలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నియమాలు పాటించాలని పవన్ కళ్యాణ్ ముందు నుంచీ బలంగా చెబుతున్నారు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్న జనసేన నాయకులు, శ్రేణులు స్వీయ ఆరోగ్య రక్షణ చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు.

Next Story
Share it