ఎస్ఈసీ తొలగింపునకు ఇదేనా సమయం?

ఏపీ సర్కారు నిర్ణయంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు ఇదేనా సమయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దేశమంతా కరోనా సమస్యతో సతమతం అవుతున్న తరుణంలో జగన్ కక్షపూరిత చర్యలకు దిగటం ఏ మాత్రం సరికాదన్నారు. ముఖ్యమైన విషయాలలో జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగానే ఉంటున్నాయి.. వీటన్నిటిలోను హైకోర్టుతో చీవాట్లు పెట్టించుకున్నా "నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు" అన్న సామెతలా సాగుతోంది ప్రభుత్వం వ్యవహారం. ప్రభుత్వం తన శక్తిసామర్ధ్యాలను ప్రజలను కాపాడడంపై కేంద్రీకరించాలి.
ఇందుకు భిన్నంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలా కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోయారు.? కరోనా పడగ విప్పుతున్న సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ఎంతటి ప్రమాదంలో పడివుండేవో ఊహించగలమా..? అని ప్రశ్నించారు. దేశం ఆపత్కాలంలో ఉన్నందున ఈ సమయంలో రాజకీయాలు చేయరాదని జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోంది. మీరు తీసుకుంటున్న ఇటువంటి కక్ష సాధింపు నిర్ణయాల కారణంగా.. ఈ నియంత్రణను దాటి మీ చర్యను ఖండించవలసిన పరిస్థితిని మీరే సృష్టించారు. జనసేన కోరుకుంటున్నది ఒక్కటే.. ఇది ప్రజల ప్రాణాలను కాపాడే సమయం. మీ కార్యాచరణ ఆ దిశగా ఉండాలి.’ అని సూచించారు.