Telugu Gateway
Telangana

తెలంగాణలో 68 కాలేజీలు మూసివేత

తెలంగాణలో 68 కాలేజీలు మూసివేత
X

తెలంగాణ సర్కారు ప్రైవేట్ కాలేజీలపై కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా..అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలు అయిన నారాయణకు చెందిన కాలేజీలు 26, శ్రీచైత్యనకు చెందినవి 18 ఉన్నాయని అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా సాగుతున్న మొత్తం 68 కాలేజీలను మూసివేతకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. అనుమతులు లేకుండా రాష్ట్రంలో సాగుతున్న కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ఇటీవల హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటర్ బోర్డు రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉన్నందున మెయిల్ ద్వారానే ఈ ఆదేశాలు పంపారు.

నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలో అక్రమాలపై విచారణ చేపట్టి.. గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలల వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డును సూచించింది. అయితే మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్ధులపై ప్రభావం పడుతుందని.. అందుకే పరీక్షలు ముగిసిన తర్వాత గుర్తింపు లేని, నిబంధనలు పాటించిన కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. అందులో భాగంగానే ఇఫ్పుడు చర్యలకు ఉపక్రమించింది.

Next Story
Share it