Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!
X

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కారు దీనిపై విచారణ జరపగా..లేఖకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని తేలింది. దీంతో లేఖ బయట నుంచి వచ్చిందనే ఆరోపణలను తోసిపుచ్చలేమని అధికారులు చెబుతున్నారు. ఈ లేఖ అంశంపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడిషనల్ పీఎస్‌ సాంబ మూర్తి ని అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు వెల్లడించారు. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్‌ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పారన్నారు.

ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు సమాచారం. ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు. లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో తెలియదన్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చెప్పినట్టు లేఖ బయట నుండి వచ్చి ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు. ఈ లేఖ విషయంలో అవసరం అయితే మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ ను ప్రశ్నిస్తామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.

Next Story
Share it