Telugu Gateway
Telangana

శుభవార్త చెప్పిన ఈటెల..కొత్త కేసులు తగ్గే అవకాశం!

శుభవార్త చెప్పిన ఈటెల..కొత్త కేసులు తగ్గే అవకాశం!
X

తెలంగాణలో కొత్త కేసులు 18...మొత్తం 471

తెలంగాణలో శుక్రవారం నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం నాడు మొత్తం 665 నమూనాలను పరిశీలిస్తే అందులో 18 మందికి పాజిటివ్ వచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈటెల రాజేందర్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా వచ్చిన 18 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కు చేరాయన్నారు. గురువారం ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ తో మరణించారన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 12కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 414 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. లాక్ డౌన్ వల్లే కేసులు తగ్గాయని, లేదంటే చాలా ప్రమాదకర పరిస్థితి ఉండేదన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ కరోనా వచ్చి కోలుకుని డిశ్చార్జి అయిన వారు 45 మంది ఉన్నారని తెలిపారు.

ఏప్రిల్ 22 నాటికి ప్రస్తుతం ఉన్న వాళ్లంతా కోలుకుని డిశ్చార్జి అవుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. తెలంగాణలో మొత్తం 101 హాట్ స్పాట్ లను గుర్తించామని..ఇక్కడ రాకపోకలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. మర్కజ్ వ్యవహారం లేకపోతే ఇప్పటికే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా మారేదన్నారు. శుక్రవారం నాడు మరో 60 నుంచి 70 వరకూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని మొత్తం కేసుల్లో 385 కేసులు మర్కజ్ వెళ్ళి వచ్చిన వారు.వారిని కాంటాక్ట్ లే అన్నారు.

Next Story
Share it