Telugu Gateway
Telangana

తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయ్

తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయ్
X

రాష్ట్రంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టాయని..ఇది శుభ సూచికమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం నాడు కొత్తగా ఆరు కేసులు వచ్చాయని..అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. ఈటెల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..‘ఈ రోజు 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం పాజిటివ్ కేసులు 1009. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 374. 22 జిల్లాలు ఒక్క కేసు కూడా లేని జిల్లాలుగా మారాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉంటే..తెలంగాణలో తగ్గుతున్నాయి. తెలంగాణ సర్కారు చర్యల మీద కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది. గొప్పగా చేస్తున్నారు అని ప్రశంసించారు.

610 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ఇఫ్పటివరకూ కరోనా కారణంగా 25 మంది మరణించారు. ఇందులో చాలా మంది రకరకాల ఇతర జబ్బులతో కూడా బాధపడుతున్నరు. అయినా మేం వాటిని కరోనా మరణాలుగానే చూపించాం. గత ఆరు రోజులుగా కరోనా కేసులు బాగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది శుభసూచికం. దీన్ని అర్ధం చేసుకోలేని కొంత మంది..పార్టీలు..సంస్థలు..వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు. టెస్ట్ లు చేయటంలేదని అపవాదులు మోపుతున్నారు.రాష్ట్రంలో 19063 మందికి పరీక్షలు నిర్వహిస్తే 1009 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. టెస్ట్ ల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే ముందుకు సాగుతున్నామని ఈటెల స్పష్టం చేశారు. కేరళ తర్వాత గొప్పగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..చాలా మంది చికిత్స తీసుకుని నేరుగా ఇంటికెళుతున్నారని తెలిపారు.

Next Story
Share it