Telugu Gateway
Andhra Pradesh

విరాళాల స్వీకరణలో కూడా తేడాలా?!.

విరాళాల స్వీకరణలో కూడా తేడాలా?!.
X

రెండు కోట్లు ఎక్కువా..ఐదు కోట్లు ఎక్కువా?

‘వాళ్లు మాత్రమే సీఎస్ కు ఎందుకు విరాళాలు ఇచ్చారు. మిగిలిన వారంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎలా ఈజీగా వెళ్ళగలుగుతున్నారు. మార్చి31న అమరావతిలో దివీస్ లేబరేటరీస్ కరోనాపై పోరుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. అయితే ఈ ఐదు కోట్ల చెక్కును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి అందజేశారు. దివీస్ తోపాటు ఎన్ సీసీ కూడా అదే రోజు కోటి రూపాయల విరాళం అందజేసింది. వాళ్లు కూడా సీఎస్ కే చెక్కు అందజేశారు. కానీ అదే రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం సహాయ నిధికి సంబంధించి 40 లక్షల రూపాయల విరాళాన్ని స్వీకరించారు. సీఎస్ విరాళాలు స్వీకరించటం తప్పేమీ కాదు..అందులో ఆక్షేపించాల్సింది కూడా ఏమీలేదు. కానీ ఐదు కోట్లు, కోటి రూపాయల విరాళాలు ఇచ్చే వారినని సీఎస్ దగ్గరకు ఎవరు పంపారు?. 40 లక్షల రూపాయలు మాత్రం అదే రోజు సీఎం జగన్ తీసుకోవటం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు తప్ప మళ్లీ ఎవరూ విచిత్రంగా సీఎస్ కు విరాళాలు ఇచ్చినట్లు కన్పించలేదు. బుధవారం నాడు కూడా వల్లభ గ్రూప్ 50 లక్షల రూపాయలు, లైలా గ్రూప్ తరపున మాజీ ఎంపీ గోకరాజు రంగరాజు కోటి రూపాయల విరాళాలు అందజేశారు.

దివీస్ కంటే తక్కువ విరాళం ఇచ్చిన శ్రీసిటీ వ్యవస్థాపకుడు రవి సన్నారెడ్డి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విరాళం స్వీకరించారు. ఆయన రెండు కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి అందజేశారు. అంతమాత్రాన రెండు కోట్ల రూపాయలు తక్కువ మొత్తం అనటం లేదు. కానీ ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన వారిని సీఎస్ దగ్గరకు పంపి..రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన వారికి కూడా జగన్ సాదరంగా ఆహ్వానం పలకటం అధికార వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కియా మోటార్స్ కూడా గురువారం నాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్ల రూపాయలు విరాళం అందజేసింది. కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ ఈ చెక్కును సీఎం జగన్ కు అందజేశారు. వీరితోపాటు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా మూడు రోజుల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించింది.

Next Story
Share it