Telugu Gateway
Telangana

త్వరలో కేసులు తగ్గుతాయి

త్వరలో కేసులు తగ్గుతాయి
X

తెలంగాణలో కంటైన్మెంట్‌ జోన్లలో తప్ప ఇతర ప్రాంతాల్లో కొత్త కేసులు రావడం లేదని, మరో 5,6 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 108 అంబులెన్స్‌ లు ఎక్కడైనా అందుబాటులో లేకపోతే ప్రైవేటు వాహనాలను వాడుకోవాలని సూచించారు. 104,108 సేవలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఈటల తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 693 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వైద్యులందరికి అన్ని సౌకర్యాలతో రక్షణ పరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌ లతో కలిపి మొత్తం నాలుగున్నర లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు.

గచ్చిబౌలి హాస్పిటల్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని ఈటెల తెలిపారు. తెలంగాణతో కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 13, జోగులాంబ గద్వాల్‌లో 10 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970కి చేరింది. కరోనా వైరస్‌ కారణంగా గురువారం ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృత్యువాతపడ్డ వారి సంఖ్య 25కి పెరిగింది. ఇక కోవిడ్‌-19 నుంచి కోలుకుని 262 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు.

Next Story
Share it