Telugu Gateway
Politics

అందరూ చైనాపై గుర్రు..చైనా మాత్రం భారత్ పై

అందరూ చైనాపై గుర్రు..చైనా మాత్రం భారత్ పై
X

కరోనా సంక్షోభ సమయంలో దేశాలన్నీ చైనాను టార్గెట్ చేశాయి. దీనికి ప్రధాన కారణం వైరస్ ఆ దేశంలో పుట్టడం ఒకటి అయితే..ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయి ప్రపంచానికి ఓ పెద్ద సమస్య తెచ్చిపెట్టిందనే విమర్శలను చైనా ఎదుర్కొంటోంది. ఓ వైపు అగ్రరాజ్యం అమెరికా అయితే చైనాపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు దేశాలు చైనా వైపు వేలెత్తి చూపుతున్నాయి. ఇది అంతా ఒకెత్తు అయితే చైనా ఇప్పుడు భారత్ పై గుర్రుగా ఉంది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ)లకు సంబంధించి భారత్ చేసిన మార్పులు ఆ దేశం ఆగ్రహానికి కారణం అయ్యాయి. భారత్ తో సరిహద్దు పంచుకునే దేశాలు భారత్ లోని ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలన్నా ఆటోమేటిక్ రూట్ లో కాకుండా..ప్రభుత్వ అనుమతితోనే రావాల్సి ఉంటుందని నిబంధనల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో దేశానికి కీలక సంస్థలు చైనా చేతికి చేరకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా భారత్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ విషయంలో కేంద్రానికి చాలా ముందే సూచన చేశారు కూడా. కేంద్ర నిర్ణయం తర్వాత మోడీ సర్కారుకు రాహుల్ గాంధీ అభినందనలు కూడా తెలిపారు. కేంద్ర నిర్ణయం ఇప్పుడు చైనాకు కాక పుట్టించింది.

భారత్ నిర్ణయం వివక్షా పూరితమని, స్వేఛ్చా వాణిజ్యానికి వ్యతిరేకమని, ప్రపంచ వాణిజ్యం సంస్థ నియమనిబంధనలకు వ్యతిరేకం అని వ్యాఖ్యానించింది. కొత్తగా తెచ్చిన మార్పుల ప్రకారం భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని దేశాలపై గతంలోనే ఇటువంటి ఆంక్షలు విధించగా.. తాజాగా చైనా కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. అంతకు మునుపు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆటోమేటిక్ విధానంలో భారత్‌లోకి ప్రవేశించే అవకాశం చైనా కంపెనీలకు ఉండేది. ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయంతో చైనా ఈ అవకాశాన్ని కోల్పోయింది. ఇదే ఇప్పుడు ఆ దేశం కోపానికి కారణం. అయితే భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఆగ్రహన్ని పట్టించుకునే అవకాశంలేదని చెబుతున్నారు.

Next Story
Share it