Telugu Gateway
Andhra Pradesh

అప్పుడే నాయకత్వ సత్తా తెలిసేది..చంద్రబాబు

అప్పుడే నాయకత్వ సత్తా తెలిసేది..చంద్రబాబు
X

విపత్తుల సమయంలోనే నాయకత్వ సామర్ధ్యం బయటపడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుకు రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా నివారణపై లేదని మండిపడ్డారు. వాలంటీర్లపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కూడా రేషన్ బియ్యం పేదల ఇళ్లకు సరఫరా చేయటంలో సర్కారు విఫలమైందని అన్నారు. చౌకడిపోల వద్ద ప్రజలను గంటల కొద్ది ఉండేలా చేయటం కూడా కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అయిందని ఆరోపించారు. వైసీపీ నాయకులు, వారి అనుచరులు ఇష్టానుసారం తిరుగుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ కు సూపర్ స్ప్రెడర్లుగా మారారని విమర్శించారు. లాక్ డౌన్ లో కూడా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగాయన్నారు. హెల్త్ బులెటిన్లను కూడా ఫార్స్ గా మార్చారని చంద్రబాబు తన లేఖలో విమర్శించారు. పలు అంశాలతో ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అదే సమయంలో ట్విట్టర్ వేదికగా కూడా చంద్రబాబు సోమవారం నాడు జగన్ మాట్లాడిన తీరును తప్పుపట్టారు. కరోనా తో కలసి జీవించాలంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించే అంశం అన్నారు. కరోనా కేవలం జ్వరం అనే పదే పదే మాట్లాడే వ్యక్తిని ఏమనాలని ప్రశ్నించారు.

కరోనా కేసుల విషయంలో దక్షిణ భారత దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందని..రాష్ట్రాన్ని ఆ దేవుడే రక్షించాలని వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం కొన్న ధాన్యంలో పదో వంతు కూడా ఏపీలో కొనలేదని విమర్శించారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదని చెప్పుకొచ్చారు. బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు టీడీపీ అండగా ఉందని పేర్కొన్నారు. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో కూడా నిబంధనలు వైసీపీ నేతలు పాటించలేదని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని... అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృతమైందని తెలిపారు. కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైసీపీ నేతల ధోరణి ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it