కనగరాజ్ కరోనా కట్టడి చేసే శాస్త్త్రవేత్తా..అంత హడావుడి ఎందుకు?

లాక్ డౌన్ రోజుల్లో కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారు?
ట్విట్టర్ లో అచ్చెన్నాయుడు
దేశమంతా కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఏపీ కొత్త ఎస్ఈసీ రాష్ట్రానికి ఎలా వచ్చారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆయన ట్విట్టర్ లో పలు అంశాలపై స్పందించారు. అచ్చెన్నాయుడు కామెంట్స్ ఇలా ఉన్నాయి. ‘సీఎం గారూ, అత్యధిక కరోనా కేసులున్న తమిళనాడు నుంచి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జస్టిస్ కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారు? తెలంగాణ బోర్డర్‌లో వేలాదిమంది ఏపీవాళ్లు క్వారంటైన్‌కి వెళ్తామంటేనే రానిస్తామన్న మీరు దీనికేమి సమాధానం చెబుతారు? కరోనాకోరల్లో చిక్కి రాష్ట్రం విలవిల్లాడుతోంది. పనుల్లేక కూలీలు, పంటలు అమ్మలేక రైతులు, సకలవర్గాలు తమను ఆదుకోవాలంటూ చేస్తున్న ఆక్రందనలు మీకు వినపడవు. కరోనా వ్యాప్తి జరగకుండా ఎన్నికలు వాయిదావేసిన కమిషనర్ ని తొలగించేందుకు అత్యవసర ఆర్డినెన్స్, సెలవురోజుల్లో రహస్యజీవోలిచ్చారు.
కరోనా ప్రభావం వృద్ధులపై ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నా 84 ఏళ్ల కనగరాజ్‌ని తీసుకొచ్చారు. ఆయనేమైనా కరోనా కట్టడి చేసే శాస్ర్తవేత్తా? వైద్యుడా? బాధ్యతలు స్వీకరించేటప్పుడు మాస్క్ కూడా పెట్టుకోని ఆయన రాష్ట్ర ప్రజల ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్నారు. స్వార్థయోజనాల కోసం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మీరు, మీ మంత్రులు క్వారంటైన్ పాటిస్తున్న చంద్రబాబును దమ్ముంటే హైదరాబాద్ నుంచి రమ్మంటున్నారు. పాలన చేతకాదని భేషరతుగా ఒప్పుకోండి. చంద్రబాబు వచ్చి పాలనంటే ఏంటో చూపిస్తారు. ’ అని వ్యాఖ్యానించారు.