ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రంగంలోకి దిగారు. కమిషన్ అధికారులతో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యథాతథ స్థితిని ఎన్నికల కమిషనర్‌కు అధికారులు వివరించారు. విధుల్లో సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని కనగరాజ్ కోరారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో మున్సిపల్, జడ్పీటీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ లకు ఎన్నికల ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. సమయానుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని జస్టిస్ కనగరాజ్ పేర్కొన్నారు.