Telugu Gateway
Andhra Pradesh

లాక్ డౌన్ ఎత్తేయగానే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు!

లాక్ డౌన్ ఎత్తేయగానే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు!
X

దక్షిణ కొరియా మోడల్ ఫాలో అవుదామంటున్న సీఎంవో

ఏపీ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొత్తగా షెడ్యూల్ విడుదల చేసే ఆలోచనలో ఉందా?. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చోపచర్చలు సాగాయా?. ఓ వైపు కరోనా మహమ్మారి వెంటాడుతున్నా దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలోని 300 సీట్లకు ఎన్నికలు పూర్తి చేసుకుందనే విషయాన్ని సీఎంవో అధికారులు జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్ళినట్లు ‘డెక్కన్ క్రానికల్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఏపీలోనూ దక్షిణ కొరియా మోడల్ ను ఫాలో అయి సాధ్యమైనంత వేగంగా ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఏపీకి కొత్త ఎస్ఈసీగా కనగరాజును నియమించినందున..ఆయన నియామకంపై హైకోర్టు స్టే ఇవ్వనందున ఎస్ఈసీకి కొత్త షెడ్యూల్ ఇచ్చే సర్వాధికారాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

కానీ సర్కారు దూకుడు నిర్ణయాలపై అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది. ‘అప్పుడంటే మార్చి31లోగా ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. లేకపోతే ఏపీకి రావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయల నిధులు పోతాయన్నారు. అభ్యర్ధుల ఖరారుకు కూడా సమయం చిక్కనంత స్థాయిలో పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశారు. అందులో కొంత లాజిక్ ఉంది. కానీ కారణాలు ఏమైనా మార్చి 31 డెడ్ లైన్ ముగిసిపోయింది. ఇప్పుడు నిధులు..ఎన్నికలకు లింక్ లేదు. అయినా సరే జగన్ సర్కారు ఎన్నికలపై ఎందుకంత ఉత్సుకత చూపిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు నవంబర్ లో జరిగినా..డిసెంబర్ లో జరిగిన పెద్దగా తేడా ఉండదు. కానీ జగన్ సర్కారు ఎందుకు ఈ ఎన్నికలను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఈ ఎన్నికలపై అంత పట్టుదల ఎందుకు?. ఓ వైపు ఏపీలో కరోనా కేసుల ఉదృతి ఎంతో వేగంగా ఉన్న ఈ దశలో కూడా ఇంకా ఎన్నికలపై తపిస్తుండటం అధికార వర్గాలను ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇఫ్పుడు ఏపీ సర్కారు ఏ దక్షిణ కొరియా మోడల్ ను ఫాలో అవ్వాలని ఆలోచిస్తున్నారో..అక్కడే కరోనా తగ్గిన వాళ్ళకు కూడా మళ్ళీ వైరస్ సోకినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఏపీ సర్కారు మాత్రం ఎన్నికలను ‘అత్యవసరం’ అన్నట్లు..ఇవి జరగకపోతే ఇక ఏపీ ఇక ముందుకు వెళ్లదన్నంత కలరింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు కన్పిస్తోంది. ఏపీలోని పది జిల్లాలు ఇఫ్పుడు కరోనా రెడ్ జోన్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రానికి మొత్తం 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Next Story
Share it