పొదుపు సంఘాలకు ఆన్ లైన్ లో రూ1400 కోట్లు జమ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మహిళా సంఘాలకు 1400 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. బ్యాంకులకు మహిళా సంఘాలు కట్టాల్సిన వడ్డీ మొత్తాన్ని సర్కారు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఆన్ లైన్ ద్వారా ఈ నిధుల బదిలీకి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ఆన్ లైన్ లో బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఒకే సారి డబ్బులు జమ అయ్యాయని సర్కారు తెలిపింది.
90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో ,400 కోట్ల రూపాయలు ఒకే విడత జమ అయ్యాయి. ఆ తర్వాత జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్నో సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు జగన్. లాక్ డౌన్ తో ఇంటి నుంచి బయటకు రాలేని సమయంలో అందిన ఈ నిధులు మహిళా సంఘాలకు ఊరటనిస్తాయనటంలో సందేహం లేదు.