Telugu Gateway
Andhra Pradesh

జగన్ నేరుగా కాకుండా వీడియో సందేశం ఎందుకిచ్చారు?

జగన్ నేరుగా కాకుండా వీడియో సందేశం ఎందుకిచ్చారు?
X

మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులపై బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ అంశంపై ముందస్తుగానే మీడియాకు సందేశం వచ్చింది. ఛానళ్ళలో అయితే జగన్ సందేశం లైవ్ అని వచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే అది ఎడిడెట్ వీడియోను టెలికాస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఆ ఎడిటింగ్ కూడా సరిగాచేయలేదని కొంత మంది అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అంతే కాకుండా జగన్ చెప్పాల్సిన అంశాలు అయిపోగానే స్క్రీన్ బ్లాంక్ గా మారిపోవటంతో ఇది రికార్డెడ్ వీడియో అన్న విషయం మీడియా సర్కిళ్ళలో ఒక్కసారిగా గుప్పుమన్నది. నిజానికి ఏపీలో ఊహించని రీతిలో పెరిగిన కేసులపై మాట్లాడాల్సిన జగన్ ఎందుకు నేరుగా టీవీల ముందుకు రాకుండా ‘రికార్డ్’ చేసిన సందేశాన్ని విడుదల చేయాల్సి వచ్చిందన్న చర్చ మొదలైంది. గత కొంత కాలంగా జగన్ విలేకరుల సమావేశంలో పొరపాటుగా చేస్తున్న వ్యాఖ్యలను ప్రతిపక్ష టీడీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది.

ఇది అధికార వైసీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. అందులో భాగంగానే రికార్డ్ చేసిన సందేశాన్ని విడుదల చేశారని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరూ ఇలా ప్రజలకు రికార్డెడ్ సందేశాన్ని ఇఛ్చిన సీఎం లేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎప్పుడైనా బయటకు రాలేని పరిస్థితి ఉంటేనో..లేక ఏదైనా ఇతర ఇబ్బంది ఉంటే ఇలా చేస్తారు కానీ..సీఎం జగన్ చురుగ్గా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ..విరాళాలు స్వీకరిస్తూ అత్యంత కీలకమైన సమయంలో ప్రజలకు ఇఛ్చే సందేశాన్ని వీడియో రూపంలో అందించటం అనేది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రజల్లో భరోసా, ధైర్యం నింపటాన్ని ఎవరూ ఆక్షేపించరు. ఓ వైపు సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కరోనా వైరస్ కు ముందు లేదని...భౌతిక దూరం పాటించటంతోపాటు ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఉండటమే ఏకైక మార్గం అని చెబుతుంటే..సీఎం జగన్ మాత్రం ముందులు వేసుకుంటే తగ్గుతుందని..ఇది క్యూరబుల్ అని వ్యాఖ్యానించటం విశేషం. అయితే కరోనా పాజిటివ్ పేషంట్లకు ఇస్తున్న చికిత్స మాత్రం చాలా వరకూ సత్ఫలితాలు ఇస్తోంది.

Next Story
Share it