బిల్లులు ఆమోదం పొందాకే రాజధాని తరలింపు

రాజధాని వికేంద్రీకరణ సంబంధించిన బిల్లులు ఆమోదం పొందిన తర్వాతే అమరావతి నుంచి రాజధాని తరలింపు ఉంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. ఇదే అంశంతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఏజీని కోరింది. రాజధాని తరలింపునకు సంబంధించి పరిణామాలు వేగంగా జరుగుతున్నాయంటూ జెఏసీ వేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన తరుణంలో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలుకు తమకు పది రోజుల సమయం కావాలని ఏజీ కోరగా..అందుకు కోర్టు సమ్మతించింది.
ఈ అంశంపై కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఏజీని కోరింది. అమరావతి పరిరక్షణ సమితి తరపున కార్యదర్శి గద్దె తిరుపతి రావు పిటిషన్ వేశారు.