Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలోకి ఇప్పుడే ఈ చేరికలు ఎందుకు?

వైసీపీలోకి ఇప్పుడే ఈ చేరికలు ఎందుకు?
X

వైసీపీ గత ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకుంది. 151 సీట్లు..50 శాతంపైగా ఓట్లు. ఒక్క మాటలో ఓ ‘రికార్డు విజయం’. ఎన్నికలు పూర్తయి ఇంకా నిండా ఏడాది కూడా పూర్తి కాలేదు. కానీ వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎందుకు ఫిరాయింపులకు ఇప్పుడు తలుపులు తెరుస్తోంది. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న వైసీపీ సడన్ గా వరస పెట్టి చేరికలకు ఎందుకు లైన్ క్లియర్ చేస్తోంది?. ఇంత బలంగా ఉన్న పార్టీ సొంత నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేదా?. లేదా ప్రత్యర్ధిని పూర్తిగా దెబ్బతీయాలనే ఎత్తుగడా?. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాజకీయంగా ఏపీలో ఎదురీదుతోంది. జనసేన, బిజెపిలు కలసి ఎంతటి పోటీ ఇస్తాయో వేచిచూడాల్సిందే. ఇప్పటికిప్పుడు వాతావరణాన్ని పరిశీలిస్తే పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యే అని చెప్పకతప్పదు. రాజకీయంగా ఎంతో శక్తివంతంగా ఉండి..సంక్షేమ పథకాలతో తమకు తిరుగులేదని భావిస్తున్న వైసీపీ ఇప్పుడు సడన్ గా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వెనక రాజకీయ ఎత్తుగడలే అని చెబుతున్నారు.

టీడీపీ మరింత బలహీనం అయిందన్న సంతకేతాలు ప్రజల్లో ఎంత బలంగా వెళితే రాజకీయంగా తమకు అంత లాభం చేకూరుతుందనే అంచనాతో వైసీపీ నేతలు ఉన్నారు. అందుకే వరస పెట్టి చేరికలకు మార్గం సుగమం చేస్తున్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు కూడా ఇదే పని చేశారు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. కానీ తర్వాత ఫలితం ఏమైందో అందరూ చూశారు. అధికారంలో ఉండి ప్రజల మన్ననలు పొంది రాజకీయంగా గెలవటం అనే అంశాన్ని పార్టీలు అన్నీ విస్మరిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలను ఎంత వీలైతే అంత దెబ్బ తీసే రాజకీయంగా బలోపేతం అవటానికే అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ వంటి వారిని కూడా చేర్చుకుంటున్నారు. గతంలో జూపూడీ ప్రభాకర్ రావు విషయంలోనూ ఇదే జరిగింది.

ఇఫ్పుడు కొత్తగా టీడీపీ సీనియర్ నేత, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు అయిన కదిరి బాబూరావు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన ఇవాళో..రేపో జగన్ ను కలసి వైసీపీలో చేరొచ్చని చెబుతున్నారు. బాబూరావుతోపాటు కడపలో గత కొన్ని దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న సతీష్ రెడ్డి కూడా వైసీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. దీని తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి హడావుడి మరింత పెరిగే అవకాశం ఉందని..రాజకీయంగా టీడీపీని బలహీనం చేసే ఎత్తుగడలే ఇవి అని చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ఏమి చేశారో..ఇప్పుడు జగన్ కూడా అదేబాటలో పయనిస్తున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it