Telugu Gateway
Andhra Pradesh

పవన్ సాయం రెండు కోట్లు..14 ఏళ్ళ సీఎం చంద్రబాబు పది లక్షలు

పవన్ సాయం రెండు కోట్లు..14 ఏళ్ళ సీఎం చంద్రబాబు పది లక్షలు
X

చంద్రబాబు. పధ్నాలుగు సంవత్సరాలకుపైనే ముఖ్యమంత్రి. ఆయన కరోనాపై పోరుకు ఫ్యామిలీ పరంగా ప్రకటించిన సాయం పది లక్షల రూపాయలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల జీతం సీఎం సహాయ నిధికి ఇస్తారని ప్రకటించారు. చంద్రబాబు అసలు వ్యక్తిగతంగా సాయం ప్రకటించకపోయినా ఒక రకంగా బాగుండేది. కానీ జనసేన అధినేత, సినిమా హీరో పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు ఏపీకి 50 లక్షల రూపాయలు, తెలంగాణకు 50 లక్షల రూపాయలతోపాటు ప్రధాని మోడీ సహాయ నిధికి కోటి రూపాయలు మొత్తం కలిపి రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. పవన్ రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించటంతోనే చంద్రబాబు పది లక్షల రూపాయల సాయం అన్నది చర్చనీయాంశంగా మారింది. దాదాపు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండటమే కాకుండా..ఏకంగా పధ్నాలుగు సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా, దశాబ్దానికిపైగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు పది లక్షల కంటే ఎక్కువ సాయం చేయలేరా? అన్న చర్చ మొదలైంది.

అంతే కాదు...ఆర్ధిక వనరుల పరంగా..వ్యాపారాల పరంగా చూస్తే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు అసలు పోలికే లేదు. ప్రతి ఏటా చంద్రబాబు ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే ఆస్తులే వందల కోట్ల రూపాయలు ఉంటాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎంతో ఉదారంగా రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటిస్తే..చంద్రబాబు పది లక్షల రూపాయల వ్యవహారం దీని ముందు తేలిపోతుంది. ఏది ఏమైనా ఇతర నటులు, రాజకీయ నాయకులతో పోలిస్తే ఇంత ఉదారంగా రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story
Share it