రాధిక నాకు తల్లి కాదు!
వరలక్ష్మి శరత్ కుమార్. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పదలచుకున్న విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలు వెల్లడించారు. తనకూ అలాంటి అనుభవనాలు ఎదురయ్యాయని..అయినా సరే వాళ్లు చెప్పిన వాటికి తాను తలొగ్గలేదని చెప్పారు. దీని వల్ల అవకాశాలు పోయినా తాను డోంట్ కేర్ అన్నట్లుగానే ఉన్నానని..ఎవరికైనా క్యాస్టించ్ కౌచ్ పరిస్థితి వస్తే అందుకు నో చెప్పాలని వరలక్ష్మి శరత్ కుమార్ సూచించింది. తమిళంలో పోడాపోడీ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ భామ ఆ తరువాత కన్నడంలో నటించింది. తాజాగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో అయితే పాత్రలో నటించడానికి అవకాశం ఉంటే అది కథానాయకి అయినా, ప్రతినాయకి అయినా ఓకే అంటోంది.
అలా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీశరత్‌కుమార్ అతి తక్కువ కాలంలోనే 25 చిత్రాలను పూర్తి చేసుకుంది. తనకు కోపం ఎక్కువని, రౌడీనని, చిన్న వయసు నుంచి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తానని చెప్పింది. అందుకే తనతో మాట్లాడడానికి చాలా మంది భయపడతారని అంది. మరో విషయాన్ని కూడా వరలక్ష్మీశరత్‌కుమార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. శరత్‌కుమార్ మొదటి భార్య కూతురే వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె ఇంటర్వ్యూలో పలు విషయాలను తనదైన స్టైల్‌లో చెప్పారు. అందులో ముఖ్యంగా తాను రాధికను ఆంటీ అనే పిలుస్తానని చెప్పింది. ఎందుకంటే ఆమె తన తల్లి కాదని తెలిపింది. తనకు అమ్మ అంటే ఒక్కరేనని పేర్కొంది. తనకే కాదు ఎవరికైనా అమ్మ ఒక్కరే అని అంది. అందుకే రాధిక తనకు తల్లి కాదని, ఆంటీ అని చెప్పింది. అయితే తాను ఆమెను తన తండ్రి శరత్‌కుమార్‌తో సమానంగా గౌరవం ఇస్తానని పేర్కొంది.