Telugu Gateway
Telangana

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
X

తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావటం సర్కారు అప్రమత్తం అయింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ భేటీ అయి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తోందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అన్నారు. గతంలో వచ్చిన ఇతర వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువగా ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వివరించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖతోపాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వైరస్‌పై అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. కరోనా సమస్యను ఉపయోగించుకుని.. ఎవరైనా వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రజలను చైతన్యం చేసేందుకు పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించాలని, దీనికోసం సమాచార, ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కరోనా వైరస్ నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల కమిటీ కీలక శాఖలకు పలు ఆదేశాలు జారీ చేసింది.

Next Story
Share it