Telugu Gateway
Andhra Pradesh

బీసీల రిజర్వేషన్ల పై సుప్రీంకు టీడీపీ

బీసీల రిజర్వేషన్ల పై సుప్రీంకు టీడీపీ
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతుల సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును వీరు ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేసిన వారిలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్పలు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని వీరు ఆరోపించారు. వైసీపీ సంబంధిత వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు హైకోర్టులో సుప్రీంకోర్టులోనూ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేశారని మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే వారి రిజర్వేషన్లనే జగన్ కుదిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు తగ్గడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది బీసీ నాయకులు సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.

సొంత కేసులకు కోట్ల రూపాయల న్యాయవాదులు పెట్టుకునే జగన్ బీసీల కేసులో ఎందుకు సమర్ధుడైన లాయర్ ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 176 ను యధాతథంగా అమలు చేయాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకునేందుకు చూశారు తప్ప వారికి న్యాయం చేయాలని చూడలేదని నిమ్మల కిష్టప్ప విమర్శించారు. ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్లే తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ 24 శాతానికి ఎలా పడిపోతుందని ప్రశ్నించారు. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు దిగారని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆరోపించారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. కోర్టుల ద్వారా రిజర్వేషన్ల అమలుకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ముందే ఎందుకు గ్రహించి స్పందించలేదని ప్రశ్నించారు.

Next Story
Share it