Telugu Gateway
Politics

అమెరికాలో ఒక్క రోజే పది వేల కేసులు

అమెరికాలో ఒక్క రోజే పది వేల కేసులు
X

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ఒక్క రోజులోనే అమెరికాలో పది వేల కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. పరీక్షలు అన్నీ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారం నాడే పది వేల కేసులు వెలుగుచూశాయి. అమెరికా మొత్తంలో బాధితుల సంఖ్య ప్రస్తుతం 54 వేల కు చేరింది. ఏప్రిల్ 12 నాటికి అమెరికాలో పరిస్థితి రికవరి అవుతుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించారు. ఇది ఒక్కటే కాస్త కాస్తలో అమెరికా ప్రజలకు ప్రస్తుతం ఊరట కల్పించే అంశం. మంగళవారం నాడు అమెరికాలో ఏకంగా 150 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 775కి చేరింది. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ మంగళవారం నాడే 53 మంది మరణించారు. దీంతో మొత్తం న్యూయార్క్ లో మరణించిన వారి సంఖ్య 201కి పెరిగింది.

అయితే వాషింగ్టన్ లో మాత్రం మంగళవారం నాడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.అమెరికాలో ఇప్పటివరకూ 3.70 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా పరీక్షలు చేయాల్సిన కేసులు ఉన్నాయని చెబుతున్నారు. అమెరికా ప్రజల ఆర్ధిక కష్టాలు తీర్చేందుకు ప్రతిపాదించిన రెండు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి త్వరలోనే ఆమోదం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలు అందరూ సహకరించాలని, ప్రజలు ఎక్కడా కూడా భారీ సంఖ్యలో గుమిగూడవద్దని ట్రంప్ కోరారు. సామాజిక దూరం పాటించటం..ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

Next Story
Share it