Telugu Gateway
Politics

సంక్షోభంలో మధ్యప్రదేశ్ సర్కారు

సంక్షోభంలో మధ్యప్రదేశ్ సర్కారు
X

మరో కాంగ్రెస్ సర్కారు సంక్షోభం దిశగా సాగుతోంది. సేమ్ కర్ణాటక ఫార్ములానే మధ్యప్రదేశ్ లో కూడా అమలుకు బిజెపి రెడీ అయినట్లు స్పష్టమైన సంకేతాలు కన్పిస్తున్నాయి. కమల్ నాథ్ సర్కారును కూల్చేందుకు కాంగ్రెస్ నుంచి కూడా జోతిర్యాదిత్య సింథియా తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవటం..రాహుల్ గాంధీ కాడిపారేయటం..అసలు ఆ పార్టీలో ఏమి జరుగుతుందో పార్టీ నేతలకు అంతుచిక్కకుండా మారిపోయింది. గత కొన్ని రోజులుగా బిజెపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తోందని..అయినా ఢోకాలేదంటూ ప్రకటించిన కమల్ నాథ్ కు చిక్కులు స్టార్ట్ అయ్యాయి. గతవారం పదిమంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ వ్యవహరం సోమవారం నాడు మరో కీలక మలుపు తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గంలోని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. అయితే వీరంతా ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లినట్టు చెబుతున్నారు. సింధియా అండతో రెబెల్‌ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు చెబుతున్నారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియాతో కలిసి బీజేపీ కుట్రపన్నిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నా సింథియా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం అనుమానిస్తోంది. మరోవైపు కమల్‌నాథ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సరపడ బలం లేదని బీజేపీ వాదిస్తోంది. ప్రభుత్వంపై చాలామంది సభ్యులు అసంతృప్తితో ఉన్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Next Story
Share it