Telugu Gateway
Andhra Pradesh

మందు బాటిళ్ళతో ప్రెస్ మీట్ పెడతారా?. రోజా ఫైర్

మందు బాటిళ్ళతో ప్రెస్ మీట్ పెడతారా?. రోజా ఫైర్
X

ఏపీలో ‘మద్యం’ రగడ ఆగటం లేదు. ‘జె’ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజలు ఎక్కువగా వాడే బ్రాండ్లు వదిలేసి..కేవలం జగన్ కు కమిషన్లు ఇచ్చే బ్రాండ్లనే ఏపీలో అమ్ముతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఆ పార్టీ నేత బోండా ఉమా మద్యం బాటిళ్ళతో సహా మంగళవారం నాడు విలేకరుల సమావేశం పెట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దగ్గర నుంచి మొదలుకుని టీడీపీ నేతలు అందరూ మద్యం బ్రాండ్ల అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు. మద్యాన్ని నియంత్రించాలంటే రేట్లు పెంచుతారు కానీ...అలా కాకుండా కేవలం కొన్ని బ్రాండ్లను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించటం అంటే ఇది కేవలం దోపిడీ మాత్రమే అని టీడీపీ నేతల వాదన. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా అదే స్థాయిలో టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. గ్రామ వాలంటీర్లు ఇంటింటికి మద్యం పంపిణీ చేస్తున్నారని టీడీపీ చేసిన ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు.టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మద్యపాన నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని రోజా తెలిపారు.

మందు బాటిళ్లు టీడీపీ ఆఫీసులో ప్రదర్శించారంటే అది టీడీపీ ఆఫీసా లేక బార్ షాపా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మద్యం ఎరులై పారిందని... ఈ విషయాన్ని మహిళలెవరూ మర్చిపోలేదని రోజా అన్నారు. బీరును హెల్త్ డ్రింక్ అని టీడీపీ మాజీమంత్రి కామెంట్ చేశారని ఆమె గుర్తు చేశారు. మద్యం బాటిళ్లను ప్రదర్శించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. టీడీపి నాయకులకు అధికారం పోయాక పిచ్చెక్కింది. బార్ సేల్స్ మేన్‌లా బొండా‌ ఉమ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా కనిపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సంతకం అంటే ఐఎస్ఐ ముద్రలా ఉండాలని... కానీ చంద్రబాబు బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని సంతకం చేసి మర్చిపోయారని రోజా మండిపడ్డారు.

Next Story
Share it