Telugu Gateway
Andhra Pradesh

నామినేషన్లకే ఇంత బీభత్సం చేశారు..ఎన్నికలకు ఎలా చేస్తారో?

నామినేషన్లకే ఇంత బీభత్సం చేశారు..ఎన్నికలకు ఎలా చేస్తారో?
X

అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే అసలు వైసీపీకి గౌరవమేలేదని..దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఇక ఎన్నికలు పెట్టడం ఎందుకు అని ప్రశ్నించారు. ఏపీ చరిత్రలోనూ ఎప్పుడూ ఇలాంటి హింసను చూడలేదన్నారు. వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన అసవరం ఉందని అన్నారు. స్థానిక సంస్థల అభ్యర్ధులకు జనసేన, బిజెపి అండగా ఉంటాయన్నారు. పవన్ కళ్యాణ్ గురువారం నాడు అమరావతిలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవదర్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లతో కలసి ఇరు పార్టీల స్థానిక సంస్థల విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. గ్రామాల రూపురేఖలు మార్చే స్థానిక సంస్థల ఎన్నికలను బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. నామినేషన్లకే ఇంత బీభత్సం సృష్టిస్తే... రేపు పోలింగ్ సమయంలో ఎంత హింస సృష్టిస్తారోనని ప్రజలు భయపడుతున్నారన్నారని వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసి గెలిచినా అలాంటి గెలుపు ఎన్నటికీ నిలబడదని అన్నారు. “2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించకుండా దాట వేస్తే... ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, దాడులతో ఎన్నికలను ఏకపక్షం చేయాలని చూస్తోంది. యువతకు అవకాశం కల్పించాలని మేము ఒకవైపు ఆలోచిస్తుంటే... వీళ్లేమో నామినేషన్లు వేయలేని పరిస్థితి సృష్టిస్తున్నారు. దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఎలక్షన్లు ఎందుకు..? జగన్ రెడ్డి వారి అభ్యర్ధులను మాత్రమే నిలబెట్టుకొని ఏకగ్రీవం అని ప్రకటించుకోవచ్చుగా. ఈ మధ్య ఢిల్లీలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్లు ఏపీ మరో బీహార్ రాష్ట్రంలా తయారవుతోంది అన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన నాయకులపై రాళ్ల దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చించివేయడం, ప్రశాంత గోదావరి జిల్లాల్లో భూసేకరణ పేరుతో భూములు లాక్కొంటామని, బైండోవర్ కేసులు పెడతామని రైతులను బెదిరించడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. నామినేషన్ల వేళ ఇంతటి హింసను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎప్పుడు చూడలేదు. ఎక్కడో అడపాదడపా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి తప్ప... 13 జిల్లాల్లో ఇప్పుడు ఏ మూలన చూసినా అరాచకాలే. ప్రశాంతమైన గోదావరి జిల్లాలకు కూడా రౌడీయిజం వచ్చేసింది.

పోలీసు అధికారులు, ఎలక్షన్ అధికారుల ముందే వేరే పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. కొంతమంది అధికారుల కళ్లెదుటే అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ల సందర్భంగా వైసీపీ చేసిన దౌర్జన్యాలను కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. దుర్గి మండలంలో అభ్యర్థులను పోలీస్ అధికారులే బెదిరిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ పక్షంలా వ్యవహరిస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడయితే ఎలా ఉంటుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్లకు కడుతోందని అన్నారు. “ఫ్యాక్షనిస్టులు టెండర్ ఫారాలు లాక్కెళ్లడం, చించివేయడం మనం చూశాం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నామినేషన్ ఫారాలు లాక్కెళ్లడం, చించివేయడం చూస్తున్నాం. నా 47 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి అకృత్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు నేను చూడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అసలు ఎన్నికలు జరపకుండా నామినేషన్ పద్ధతిలో పదవులు భర్తీ చేస్తే సరిపోయేదిగా? ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే ఈ ఎన్నికల తంతు అంతా. మీ ప్రాంతంలో గెలవకపోతే మీ ఉద్యోగాలు పోతాయని మంత్రులను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బెదరించడమేమిటి? వారు రెచ్చిపోయి అరాచకాలు సృష్టించడమేమిటి? సాక్షాత్తు రిటర్నింగ్ అధికారుల సమక్షంలో కూడా నామినేషన్ పత్రాలను వైసీపీ గూండాలు చించివేశారు. ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు చెప్పుకున్నా దిక్కులేదు. ఇవాళ స్క్రూటనీలో కూడా ఇష్టం వచ్చినట్లు నామినేషన్లను తిరస్కరిస్తున్నారని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.

పాత ఓటరు లిస్టులో పేరు ఇలా ఉందే....కొత్త ఓటర్ లిస్టులో పేరు అలా లేదే అంటూ కుంటిసాకులు చెబుతూ అధికారులు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారు. నిన్న బూతులు తిడుతూ అభ్యర్థులను బెదిరించి మరీ నామినేషన్లు వేయకుండా చేసిన దుర్గి సబ్ ఇనస్పెక్టర్ ఈ రోజు విత్ డ్రా చేసుకోకపోతే అంతుచూస్తానని బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి ఘటనలపై నిన్న నేను ఎస్.పి. కి ఫోన్ చేస్తే మా వాళ్లనే అరెస్టు చేశారు. ఇదేంటని మళ్లీ అడిగితే మీరు చెప్పింది ఏర్పేడు గురించి కదా అని ఎస్.పి. అన్నారు. పరిస్థితి ఇలా ఉంది. నిన్న నెల్లూరులో కత్తిపోట్లు, ఇవాళ శ్రీకాళహస్తిలో కత్తిపోట్లు. ఎలక్షన్ కమిషన్ అధికారాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే జగన్ సర్కార్ మద్యం, డబ్బు పంచితే మూడేళ్లు జైలు శిక్ష అంటూ ఆర్డినెన్స్ తెచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఆర్డినెన్స్ కు మీ వాళ్లు కట్టుబడి మద్యం, డబ్బు పంచకుండా ఉంటారా? మీ వాళ్లు ఈ చర్యలకు పాల్పడితే మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారా? ఈ అరాచకాలకు బ్రేక్ పడాలంటే బి.జె.పి., జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించండి. మేము ఈ అకృత్యాలను అడ్డుకుంటాం అని పేర్కొన్నారు.

Next Story
Share it