Telugu Gateway
Andhra Pradesh

అంబానీ అడిగారు...జగన్ ఇచ్చారు

అంబానీ అడిగారు...జగన్ ఇచ్చారు
X

ముఖేష్ అంబానీ అడిగారు. జగన్ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం సంబంధం లేదని ఓ వ్యాపారవేత్తకు రాజ్యసభ సీటు కేటాయించారు. కొద్ది రోజుల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయిన విషయం తెలిసిందే. అప్పుడు మాత్రం కేవలం పెట్టుబడుల అంశంపై మాత్రమే చర్చించినట్లు వెల్లడించిన సర్కారు ఇప్పుడు అసలు విషయాన్ని వెల్లడించింది. అంబానీతో పాటు జగన్ ను కలసిన వారిలో రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఉన్నారు. అంబానీ కోరిక మేరకు జగన్ వైసీపీ కోటాలో రాజ్య సభ సీటు ఆయనకు కేటాయించారు. గతంలో చంద్రబాబునాయుడు కూడా ఏ మాత్రం సంబంధం లేని పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు రాజ్యసభ సీట్లు ఇఛ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో వైసీపీ కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది. వైసీపీకి వచ్చే నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు పారిశ్రామికవేత్తలకే వెళ్ళాయి.

అందులో ఒకటి ఏపీకి సంబంధం లేని పరిమళ్ నత్వానీ అయితే మరొకటి వైసీపీ శ్రేయోభిలాషి అయిన ఆళ్ళ అయోధ్యరామిరెడ్డికి. మిగిలిన రెండు సీట్లు ప్రస్తుత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు కేటాయించారు. వైసీపీ అధికారికంగానే సోమవారం నాడు తమ పార్టీ రాజ్యసభ అభ్యర్దుల పేర్లను వెల్లడించింది. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ లు వీరి పేర్లు ప్రకటించారు. ‘మా పార్టీ అధ్యక్షుల సమక్షంలో నిర్ణయం . 50 శాతం బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు రాజ్యసభ సీటు. పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభకు. నాలుగో సీటు పరిమల్ నత్వాని ఇవ్వనున్నాం. ముకేశ్ అంబానీ అభ్యర్థన మేరకు ఏపీ నుంచి ఆయనకు ఇవ్వడం జరిగింది. పరిశ్రమల అబివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు’ అని తెలిపారు.

Next Story
Share it