Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనం

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనం
X

రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖ

లేఖలో ఏకగ్రీవాలు..బెదిరింపులు..సీఎం హెచ్చరికల ప్రస్తావన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆయన కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పలు అంశాలతో కూడిన సుదీర్ఘ లేఖ రాసి మరోసారి ఏపీలో కలకలానికి కారణం అయ్యారు. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు షాకింగ్ గా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలు..ముఖ్యంగా కడప జిల్లాలో జరిగిన అంశాలను కూడా ఆయన అందులో ప్రస్తావించారు. అంతే కాదు..స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోతే మంత్రులకు పదవులు పోతాయని..ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉండవంటూ సీఎం జగన్ చేసిన హెచ్చరికలను కూడా రమేష్ కుమార్ తన లేఖలో ప్రస్తావించటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం చేసిన ఈ హెచ్చరిక కారణంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిపక్షాలు అయిన టీడీపీ, బిజెపి, జనసేన అభ్యర్ధులపై దౌర్జన్యాలకు దిగారని అందులో పేర్కొన్నారు.

దీంతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాల సంఖ్య ఎంత?. ఇప్పుడు జరిగిన ఏకగ్రీవాల సంఖ్య ఎంత, శాతాల వారీగా కూడా తన లేఖలో ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సరిగా వ్యవహరించని కలెక్టర్లు, ఎస్పీలు, కొంత మంది పోలీసు అధికారుల బదిలీ చేసిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాతే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కానీ సర్కారు వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా పక్కన పెట్టింది. అధికార పార్టీ నేతల బెదిరింపులు, దౌర్జన్యాలకు సంబంధించి తమకు భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కేంద్రంలో కీలక స్థానాల్లో ఉణ్న వారితోపాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, డబ్ల్యుహెచ్ వో సూచనలు, అందుబాటులో ఉన్న ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ఆరు వారాల పాటు ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వారి దగ్గర నుంచి స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై వ్యక్తిగతంగా, ఎన్నికల కమిషన్ వ్యవస్థపైనా దాడిచేసిన తరహాలో చేసిన వ్యాఖ్యల గురించి కూడా ప్రస్తావించారు.

దీనికి వీడియో క్లిప్పింగ్ ల సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిణామాల పట్ల తాను తీవ్ర ఆందోళనలో ఉన్నానని..తన భద్రత, తన కుటుంబ సభ్యుల భద్రతపై కూడా భయంతో ఉన్నట్లు తెలిపారు.రాష్ట్రంలోని అగ్రనాయకత్వం తీవ్ర అసహనంతో ఉందని.. ఏ మాత్రం సహించలేని స్థితిలో ఉన్న తరుణంలో తాను తీవ్ర ఆందోళనతోనే ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో కొంత మంది శ్రేయోభిలాషులు, సహచారులు కూడా ఈ మేరకు సూచన చేశారన్నారు. క్రిమినల్ గ్యాంగ్ లు, ఫ్యాక్షన్ వంటి పదాలను కూడా రమేష్ కుమార్ తన లేఖలో ప్రస్తావించారు.మిగిలిన ఎన్నికల ప్రక్రియ సాఫీగా పూర్తి చేసేందుకు, రాజ్యాంగపరమైన తన బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖను కోరారు.

Next Story
Share it