రాష్ట్రంలో నడుస్తున్నది ఫ్యాక్షన్ పాలనే

అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నదే జనసేన విధానం అని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయం ఏ మాత్రం ప్రణాళిక లేకుండా... అన్ని విషయాల్లో గోప్యత పాటిస్తూ పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సాగుతున్నది ఫ్యాక్షన్ పాలనే అన్నారు. మనోహర్ సోమవారం సాయంత్రం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, శ్రేణులు సమాయత్తం కావాలి. భారతీయ జనతా పార్టీతో కలసి పని చేస్తున్నాం. మన పార్టీ, బీజేపీ కలసి పని చేసేందుకు సమన్వయ కమిటీలు కూడా నియమించుకున్నాం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఇంచార్జులు, కమిటీలను కొద్ది రోజుల్లో ఖరారు చేస్తాం. కమిటీల్లో పార్టీ కోసం తపించి, పని చేసిన యువతకు సముచిత ప్రాధ్యానం ఇవ్వాలి అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే నాయకులు ప్రతి సందర్భంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొంటూ ముందుకు వెళ్తున్నాం. పార్టీ కోసం పని చేసినవారికి పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. చట్టంలో చెప్పిన వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ఏ మాత్రం దృష్టిపెట్టలేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలే చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఈ మేరకు లేఖలు వస్తున్నా స్పందించడం లేదు. మూడేళ్లపాటు వచ్చిన నిధులకు యూసీలు ఇవ్వలేదు. అవి ఇస్తే నిధులు వస్తాయి. ఇతర నిధులు కూడా తెచ్చుకోవడం లేదు. గత ప్రభుత్వంలో కూడా రూ.3 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. అవి ఎలా వినియోగించారు. ఈ పాలకులకు విశాఖపట్నంపై దృష్టి ముందు నుంచి ఉంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి ఉమ్మడి రాష్ట్రంలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు.. అప్పటికే ఇక్కడ ఉన్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే అలా వచ్చారు.
ఇప్పుడు పాలనా రాజధాని అంటున్నారు. అందులోనూ గోప్యతే. అర్థరాత్రి జీవోలు ఇస్తారు. అవీ గోప్యంగా ఉంచుతారు. రాజధాని విషయంలో పార్టీ ఒక విధానం తీసుకొనే ముందు పవన్ కల్యాణ్ చాలా కూలంకషంగా చర్చించారు. మూడు విడతలుగా అన్ని ప్రాంతాల నాయకులు, ముఖ్య శ్రేణులతో విస్తృతంగా చర్చించారు. అప్పుడే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చెప్పారు. ఉత్తరాంధ్రలో వలసలు చూస్తుంటే ఇది ఎంతగా వెనక్కి నెట్టివేశారో తెలుస్తుంది. అలాంటి ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి ఇచ్చి, అన్ని విధాలా అభివృద్ధి చేసే ప్రాజెక్ట్స్ రావాలి. అలాగే ఇక్కడి రైతులకు అవసరమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం.’ ఉందని తెలిపారు. ఈ నెల 14వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని పార్టీ అధ్యక్షులు నిర్ణయించారు. ‘