Telugu Gateway
Andhra Pradesh

రమేష్ కుమార్ లేఖ అంశంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రమేష్ కుమార్ లేఖ అంశంపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ అంశంపై మరింత స్పష్టత వచ్చింది. రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర హోం శాఖకు అందిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లేఖ కమిషనర్ రాశారన్నదే తనకున్న సమాచారం అని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రం సూచనల మేరకే సీఆర్ పీఎఫ్ దళాలతో రమేష్ కుమార్ కు భధ్రత కల్పించారని తెలిపారు. రాష్ట్ర పరిధిలోని అంశం అయినా అవసరం అయితే కేంద్రం జోక్యం చేసుకుంటుందని తెలిపారు. రమేష్ కుమార్ లేఖపై రాష్ట్ర సీఎస్ తో హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని తెలిపారు. అధికారులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ లేఖపై రాష్ట్ర సీఎస్ తో మాట్లాడి రక్షణ ఇవ్వాలని చెప్పాం.

వీలైతే ఇవాళ లిఖితపూర్వక ఆదేశాలు రాష్ట్రానికి ఇస్తాం. ఏ అధికారులను అయినా బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు. రమేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో రక్షణలోనే ఉన్నారు. ఏపీ వెళ్తే పూర్తి రక్షణ సీఎస్ కు చెప్పామన్నారు. కిషన్ రెడ్డి ప్రకటనతోఈ విషయంలోమరింత స్పష్టత వచ్చినట్లు అయింది. ఈ లేఖ అంశంపై అధికార వైసీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అసలు ఈ లేఖ రాశారా? లేదా అన్నఅంశంపై రమేష్ కుమార్ స్పందించాలని వైసీపీ నేతలు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. కానీ రమేష్ కుమార్ మాత్రం ఇంత వరకూ దీనిపై స్పందించలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో మరింత స్పష్టత వచ్చినట్లు అయింది.

Next Story
Share it