Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణలో అన్ని ప్రార్ధనాలయాలు బంద్

తెలంగాణలో అన్ని ప్రార్ధనాలయాలు బంద్
X

రాష్ట్రంలోని థియేటర్లు, పార్కుల మూసివేత ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. తొలుత వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించామని..ఇప్పుడు వాటిని ఈ నెలాఖరు వరకూ మూసేయాల్సిందేనని స్పష్టం చేశారు. పాఠశాలలు కూడా ముందు ప్రకటించినట్లుగానే ఈ నెలాఖరు వరకూ మూసి ఉంటాయని..అయితే పదవ తరగతి పరీక్షలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్ధులు పరీక్షలకు ఎంతో ప్రిపేర్ అయ్యారని..వాయిదా పడితే వాళ్లు డిస్ట్రబ్ అవుతారని..అయితే ప్రతి పరీక్షా కేంద్రాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వంటి ప్రార్ధనాలయాలను కూడా మూసివేయాలని కోరామని..ఇందుకు అందరూ సమ్మతించారని కెసీఆర్ తెలిపారు. ప్రజలు గుమిగూడకుండా ఉండటమే చాలా ముఖ్యమని తెలిపారు.

అందుకు ఎలాంటి సమావేశాలు, సభలను అనుమతించటం లేదన్నారు. అదే సమయంలో కళ్యాణ మండపాలను కూడా సీల్ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఖరారు అయిన ముహుర్తాలు ఉంటే అతి తక్కువ మందితో..అది కూడా రాత్రి తొమ్మిది గంటలలోపే పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా మార్చి 1 తర్వాత అన్ని జిల్లాల్లోకి విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరున్నారో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఎస్పీలు, కలెక్టర్లు సంయుక్తంగా ఈ పనిచేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 మంది కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని..ఇందులో ప్రతి ఒక్కరూ విదేశాల నుంచి వచ్చిన వారే అని తెలిపారు. అందులో ఐదుగురు మాత్రమే విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారని..మిగిలిన వాళ్ళు అందరూ బస్సులు, రైలుమార్గాల్లో రాష్ట్రంలోకి వచ్చారన్నారు. కరీంనగర్ కు వచ్చిన వారి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నామని.వాళ్ళు మత ప్రచారం కోసం వచ్చారన్నారు. ఇటలీ-చైనా దేశాలు కరోనాను నిర్లక్ష్యం చేశాయన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంతోపాటు..వ్యక్తిగత పరిశుభ్రత, గుడిగూడకుండా ఉండటమే దీనికి పరిష్కారం అన్నారు. తెలంగాణలో ఈ దిశగా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇఫ్పటికే కేంద్రం విదేశాల నుంచి వచ్చే విమానాలను బంద్ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా నిర్వహించే ఉగాది వేడుకలు కూడా రద్దు చేస్తున్నామని..లైవ్ లో పంచాంగ వీక్షణం చేయాలన్నారు. ఎవరి ఇళ్ళలో వాళ్ళు పండగ చేసుకోవాలన్నారు. శ్రీరామనవమి విషయంలోనూ భక్తులను అమతించటం లేదని తెలిపారు. తెలంగాణకు పెద్ద సరిహద్దు ఉన్నందున కొత్తగా 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో 166 మందికి కరోనా వస్తే ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో మాల్స్-సూపర్ మార్కెట్-ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించేవి తెరిచే ఉంటాయి. అన్ని బంద్ చేయాల్సినంత సీరియస్ పరిస్థితులు తెలంగాణలో లేవన్నారు. అవసరం అయితే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చిన పదకొండు వందల మంది వచ్చిన క్వారంటైన్ చేశామన్నారు. ఎక్కడైనా విదేశాల్లో పిల్లలు చిక్కుకుని ఉంటే వాళ్లను వెనక్కి తీసుకురావటానికి చర్యలు తీసుకుంటామని..ఇప్పటివరకూ తమకు అలాంటి విన్నపాలు ఏమీరాలేదని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Next Story
Share it