Telugu Gateway
Telangana

అవసరం అయితే సరిహద్దులు మూసివేత..కెసీఆర్

అవసరం అయితే సరిహద్దులు మూసివేత..కెసీఆర్
X

కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ నిత్యం మీడియా ముందుకు వస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా అమలు కానున్న ‘జనతా కర్ఫ్యూ’కు సంబంధించిన ఏర్పాట్లను కూడా కెసీఆర్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ వైరస్ నివారణకు ప్రభుత్వం అవసరం అయితే సరిహద్దులను మూసివేయటానికి కూడా సిద్ధంగా ఉందని..పూర్తి షట్ డౌన్ కూ వెనకాడబోమని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రధాని మోడీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవన్నాన్నారు.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరాయని వెల్లడించారు. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ వచ్చాయన్నారు. సీఎం కెసీఆర్ విలేకరుల సమావేశంలోని ముఖ్యాంశాలు‘ ఇప్పటివరకూ 11 వేల మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాం. అనుమానితులను 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచుతాం.

విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, సెల్ఫ్ రిపోర్టు చేయాలి. ప్రభుత్వమే చికిత్స తో పాటు అన్ని ఖర్చులు భరిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారు... అందులో 11 వేల మందిని అదుపులోకి తీసుకున్నాం. కరోనా కట్టడికి నిరంతర నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. 63000 మంది పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.పిల్లలు, వృద్ధులు రెండు వారాలపాటు బయటికి రావొద్దు. రాష్ట్ర సరిహద్దుల్లో 54 చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. 24 గంటల జనతా కర్ఫ్యూ పాటిద్దాం. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకూ జనతా కర్ఫ్యూ. ప్రధాని చెప్పింది రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే. సీసిఎంబి లో ల్యాబ్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని కోరాను... సానుకూలంగా స్పందించారు. రేపు మెట్రో రైళ్లు, RTC బస్సులు, దుకాణాలు, అన్ని సేవలు బంద్. వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలి.

ఎమర్జెన్సీ కోసం ఐదు మెట్రో ట్రైన్ లు, డిపోకు ఐదు చొప్పున బస్సులను అందుబాటులో ఉంచుతాం. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.అవసరమైతే రాష్ట్ర సరిహద్దులను మూసి వేస్తాం. నా రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేస్తాం. కరోనా కు స్వాభిమానం ఎక్కువ... మనం ఆహ్వానిస్తేనే వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువులకు రేపు రాష్ట్రంలోకి నో ఎంట్రీ. అవసరమైతే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తాం. నిత్యావసరాల ధరలను ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి’ అని సూచించారు. కార్మికులకు అవసరం అయితే ఉచితంగా నిత్యావసరాలు సరఫరా చేసే అంశంపై కూడా చర్చించామని..ఎవరికీ ఏ ఇబ్బంది రానివ్వబోమని తెలిపారు.

Next Story
Share it