Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!

చంద్రబాబు నిర్ణయాలకు జగన్ జై!
X

జీఎంఆర్ తో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనం!

ఆర్ధిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయాలపై దుమ్మెత్తిపోస్తారు. తీవ్ర విమర్శలు చేస్తారు. కేవలం దోపిడీ కోసమే ఇదంతా చేశారని ఆరోపిస్తారు. అది కేవలం కొన్నింటిలో మాత్రమే. మిగిలిన వాటి విషయంలో మాత్రం తాను కూడా అదే లైన్ లో వెళతారు. ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసిన రెండు కీలక ప్రాజెక్టుల విషయంలో జగన్ ఎందుకు ‘రివర్స్ గేర్లు’ వేశారు. ఆ రెండింటి విషయంలో చంద్రబాబు నిర్ణయాలకు ఎందుకు జై కొట్టారు. ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండింటి విషయంలో మాత్రం చంద్రబాబు నిర్ణయాలకే ఓకే చెప్పటం వెనక మతలబు ఏమిటి?. అంటే వాటి విషయంలో జగన్ కూడా రాజీపడినట్లేనా?. ఇదే అనుమానం వ్యక్తం అవుతోంది అధికార వర్గాల్లో. చంద్రబాబు పోలవరం అంచనాలు పెంచినప్పుడు ఇది భారీ దోపిడీ అని...అవినీతి కోసం ఇలా చేశారని ఆరోపించారు.

సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చాక అవే అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు జగన్. ఇది ఒకటి. రెండవ అంశం. భోగాపురం అంతర్జాతీయ విమనాశ్రయం. రెవెన్యూ వాటా బదులుగా టిక్కెట్ మీద వసూలు చేసే యూడీఎఫ్ లో వాటా పెట్టడం ఏ మాత్రం సరికాదని ఆర్దిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో పాటు టెండర్ నిబంధనల్లో కూడా పలు ఉల్లంఘనలు ఉన్నాయని..జీఎంఆర్ కు అనుకూలంగా వీటిని ఆర్ధిక శాఖ లేవనెత్తింది. విమానాశ్రయం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని తనఖా పెట్టే జీఎంఆర్ నిధులు ఈ తెచ్చి ప్రాజెక్టును ప్రారంభించేలా నిబంధనలు పెట్టారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై 2019 మేలో సాక్షి పత్రికలో కూడా సుదీర్ఘ కథనం కూడా వచ్చింది.

కానీ జగన్మోహన్ రెడ్డి చాలా కన్వీనెంట్ గా ఈ అంశాలు అన్నింటిని విస్మరించి జీఎంఆర్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. మౌలికసదుపాయాల శాఖ వర్గాలు కూడా సర్కారు తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నామని చెబుతూ అన్ని ప్రాజెక్టులకు ‘రివర్స్ టెండరింగ్’కు వెళ్ళిన జగన్ మరి జీఎంఆర్ విషయంలో మాత్రం చంద్రబాబు నిర్ణయానికి జగన్ జై కొట్టారు. జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు కొద్ది రోజుల క్రితం ఓ విదేశీ పర్యటనలో జగన్ తో భేటీ అయ్యారని..తర్వాత ఢిల్లీలో కూడా పలుమార్లు సమావేశం అయ్యారని...తర్వాతే భోగాపురం ప్రాజెక్టు విషయంలో జగన్ సానుకూలంగా మారారని అధికార వర్గాలు చెబుతున్నాయి. రివర్స్ టెండరింగ్ కు వెళ్లి ఉంటే భోగాపురం ప్రాజెక్టులో కూడా ప్రజాధనాన్ని ఆదా చేసే అవకాశం ఉండేది కదా?. మరి జగన్ ఆ అంశాన్ని ఎందుకు వదిలేసినట్లు?

Next Story
Share it