కండువా కప్పకపోవటమే విలువలా?

‘మేం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఎవరైనా సరే వైసీపీలోకి రావాలంటే ఖచ్చితంగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ’ ఇదీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ప్రకటన. అప్పట్లో జగన్ ప్రకటనను చూసిన వారంతా శభాష్ అన్నారు. కానీ ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే రాజకీయం మారిపోయింది. గురువారం నాడు తాడేపల్లిలో కరణం బలరామ్ దగ్గర ఉండి తన కొడుకు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్చారు. ఆయన కూడా ఎక్కడా మొహమాటపడకుండా తాను ఎందుకు వైసీపీకి దగ్గర అవుతున్నదీ మీడియా సాక్షిగా చెప్పారు. అందరూ చెప్పినట్లే చీరాల అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి టీడీపీలో కరణం బలరామ్ కు అన్యాయం జరిగిందని..కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇఛ్చి కరణం లాంటి వాళ్ళను పక్కన పెట్టారని వాపోయారు. అధికారికంగా కరణం బాలరామ్ కు కండువా కప్పితే ఎమ్మెల్యే పదవి పోతుందనే కారణంగానే ‘ఈ విలువలతో కూడిన రాజకీయ మార్గాన్ని’ ఎంచుకున్నట్లు కన్పిస్తోందనే విషయం స్పష్టం అవుతోంది.
వైసీపీ నేతలు జగన్ కండువా కప్పలేదు కాబట్టి కరణం బలరామ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వాదించవచ్చు. ఓకే. కానీ కళ్ల ముందు ఏమి జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేకు నేరుగా పసుపు కండువాలు కప్పే పార్టీలో చేర్చుకున్నారు. ఇలా ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదులు చేస్తే స్పీకర్ తో వాటిని సంవత్సరాల తరబడి పక్కన పెట్టించారు. ఈ ఫిరాయింపులతో చంద్రబాబు ఎంత అప్రతిష్ట తెచ్చుకున్నదీ అందరికీ తెలుసు. అయితే జగన్ తాను చంద్రబాబులా కాదని..విలువలతో రాజకీయాలు చేస్తానంటూ ఇప్పుడు దొంగదారులు వెతుక్కుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.