తొలిసారి ఒకే మాటపై ఏపీలోని కీలక పార్టీలు

ఆశ్చర్యం. విచిత్రం. నిజంగా ఇది ఓ వింతే. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఒక విషయంలో మాత్రం ఒకే మాటపై నిలబడ్డాయి. అసలు ఏపీ రాజకీయాలే విభిన్నం. ఒకరంటే ఒకరికి ఏ మాత్రం పడదు. రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగతం వైరం స్థాయికి మారింది. అలా ఉంది ఏపీలో రాజకీయ పరిస్థితి. కానీ ప్రధాని నరేంద్రమోడీ పిలుపు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడ్డాయి. ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. దీనికి ‘జనతా కర్ఫ్యూ’ అని పేరు పెట్టారు. ఈ అంశంపై ఇఫ్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. సోసల్ మీడియాలో కూడా బాగా ప్రచారం అవుతోంది.
ప్రధాని నరేంద్రమోడీ మోడీ ప్రతిపాదించిన ఈ జనతా కర్ఫ్యూ ప్రతిపాదనకు అధికార వైసీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ, జనసేనలు కూడా మద్దతు ప్రకటించాయి. జనతా కర్ఫ్యూకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే బాటలో టీడీపీ కార్యకర్తలకూ అందరిని జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా జనసేన కార్యకర్తలు, తన అభిమానుల కోసం ఓ పత్రిక ప్రకటన విడుదల చేయటంతోపాటు వీడియో సందేశాన్ని కూడా ఇఛ్చారు. ఈ మధ్య కాలంలో ఒక అంశంపై ఏపీలోని కీలక పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు ఒకే మాటపై నిలబడిన సంఘటన ఏదైనా ఉంది అంటే ఒక్క ‘జనతా కర్ఫ్యూ’నే అని చెప్పకతప్పదు. మిగిలిన అంశాల్లో ఎవరికి వారే యమునా తీరే.
దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతో భయాందోళనలకు గురిచేస్తున్న అత్యంత కీలకమైన ఈ విషయంలోనైనా అందరూ రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు రావటం హర్షించదగ్గ పరిణామమే. జనతా కర్ఫ్యూ పిలుపునిచ్చింది ప్రధాని నరేంద్రమోడీనే అయినందున బిజెపి సహజంగానే ఈ విషయంలో రెండవ మాటకు తావు లేకుండా ముందుండి ప్రజలను చైతన్యవంతులను చేసే పనిలో పడింది. జనతా కర్ప్యూ వల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయనే అంశంపై శాస్త్రీయ అంచనాలు ఏమీ లేకపోయినా దీని వల్ల ఎంతో కొంత మేలు జరిగినా కూడా మంచిదే కదా అన్న అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో ఉంది. తెలంగాణలో అయితే సీఎం కెసీఆర్ కూడా జనతా కర్ప్యూకు మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మౌనంగా ఉంది.