Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు

ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు
X

ఇటీవల వరకూ ఏపీ కరోనా కేసుల విషయంలో అతి తక్కువ సంఖ్యతో ఉంటూ వచ్చింది. కానీ సడన్ గా ఈ సంఖ్య 40కి చేరటం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. సోమవారం సాయంత్రం వరకూ ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23 మాత్రమే. కానీ సడన్ గా మంగళవారం ఉదయం నాటికి 17 కేసులు వెలుగులోకి రావటంతో ఈ సంఖ్య 40కి చేరింది. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదు కాగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 147 మందికి నెగిటివ్‌ వచ్చింది.

గుంటూరు - 9, విశాఖ - 6, కృష్ణా - 5, తూ.గో - 4, అనంతపురం - 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రార్ధనల కోసం వెళ్లి వచ్చిన వారిలోనే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. వీరందరినీ గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. ఢిల్లీ నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన 79 మంది, ప్రకాశం జిల్లా నుంచి 83 మంది, నెల్లూరు నుంచి 103 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. ఇంకా మిగిలి ఉన్న వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమం కోసం ఏపీ నుంచి మొత్తం 369 మంది వెళ్లినట్లు గుర్తించారు. వీరందరూ మార్చి 15 నుంచి 17 వరకూ ఢిల్లీలోనే ఉన్నారు.

Next Story
Share it