Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారు తీరుపై ఐఏఎస్ ల్లో కలకలం!

ఏపీ సర్కారు తీరుపై ఐఏఎస్ ల్లో కలకలం!
X

శృతిమించిన విమర్శల ‘రాగం’ జాతీయ స్థాయిలో సర్కారు పరువు తీసిందా?!

సిగ్గుంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలి. ఇది చాలా మంది మంత్రులు, వైసీపీ నేతల మాట. ఐఏఎస్ అధికారి సిద్ధార్ధ జైన్ చంద్రబాబు తాబేదారు. ఆయన రమేష్ కుమార్ చెప్పినట్లే పనిచేశారు. ఇవీ ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు. ఏ మంత్రి అయినా..ఎమ్మెల్యే అయినా..ఐఏఎస్ అయినా తమ ప్రత్యర్ధులు సిగ్గుంటే రాజీనామా చేయాలి అంటే పదవులు వదిలి పెట్టిపోతారా?. అది జరిగే పనేనా?. అసలు ప్రభుత్వం ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటుందో అర్ధం కావటం ఐఏఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నికలు పూర్తి అయి జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కూడా ప్రభుత్వాన్ని చంద్రబాబే శాసిస్తున్నారనే తరహా వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను ఏమైనా పెంచుతాయా?. అసలు ఈ ప్రభుత్వానికి తాము ఏమి చేస్తున్నామో తెలుసుకునే చేస్తుందా? అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. సర్కారు తీరుపై ఐఏఎస్ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం వరకూ ఓకే కానీ..ఐఏఎఎస్ అధికారులను కూడా టార్గెట్ చేయటం మరీ దారుణంగా ఉందని మరో అధికారి వ్యాఖ్యానించారు. సాదారణ పరిస్థితుల్లో అయితే తమకు నచ్చని నిర్ణయాలు తీసుకునే ఐఏఎస్ అధికారులను ఏ ప్రభుత్వం అయినా పక్కన పెట్టేస్తుంది.

కానీ ఎన్నికల సమయంలో...రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్న వారి విషయంలో సర్కారుకు ఆ వెసులుబాటు ఉండదు. నిజంగా ఎస్ఈసీతో ఏదైనా సమస్య వచ్చినా కూడా సర్కారు ముందు తన పని సాఫీగా సాగిపోయేందుకు తమ సన్నిహిత అధికారులను పంపి ప్రభుత్వ సందేశాన్ని పంపుతుంది. అవసరం అయితే కీలక వ్యక్తులు కూడా రంగంలోకి దిగుతారు. చాలా సందర్భాల్లో అప్పుడు పని సాఫీగా అయిపోతుంది. ఇది అందరూ పాటించే పద్దతి. కానీ ఏపీలోని వైసీపీ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరరించిందని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) ఆరు వారాల పాటు ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన వెంటనే ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు..వైసీపీ నేతలు సామాజిక వర్గం పేరుతో ఎటాక్ చేశారు. ఇది సహజంగానే టీడీపీ వ్యతిరేకులకు, వైసీపీ అనుకూలురుకు నచ్చతుంది. చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయల రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకూ నమ్మి ఉండొచ్చు.

వైసీపీ చేసిన ఈ ఉధృత ప్రచారం వల్ల టీడీపీకి, చంద్రబాబుకు కొంత నష్టం వాటిల్లి ఉండొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ‘శృతి మించి’ చేసిన విమర్శలు ఇప్పుడు ఏపీ సర్కారు పరువును జాతీయ స్థాయిలో తీసినట్లు అయిందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఎస్ ఈసీ రమేష్ కుమార్ ఏకంగా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి సుదీర్ఘ లేఖ రాయటంతో జాతీయ స్థాయిలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ లేఖలో రమేష్ కుమార్ ప్రస్తావించిన అంశాలు కూడా ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేవిగా ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ, జనసేనలపైనే కాకుండా...ఏకంగా బిజెపి నేతలపై కూడా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్బంగా దాడులు చేయటం కేంద్రంలోని బిజెపి నేతలకు కూడా సెగ పుట్టించిందని ఓ నేత తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్ర స్థాయిలో సాఫీగా సాగిపోవాల్సిన అంశాన్ని అధికార పార్టీనే నానా రచ్చ చేసి జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నట్లు అయిందని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్డ్ అధికారి. ఆయన్ను పదవి నుంచి తప్పించటం కూడా అంత అషామాషీ వ్యవహారం కూడా కాదు. కానీ కేంద్ర హోం శాఖకు రమేష్ కుమార్ రాసిన లేఖలోని అంశాలు మాత్రం సర్కారు ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసేవిగా ఉన్నాయనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ కాబట్టి సహజంగా జాతీయ మీడియా దృష్టిని కూడా ఇది ఆకర్షిస్తుందని అంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ చాలు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పలు జాతీయ ఛానళ్లు ప్రముఖంగా ప్రస్తావించి ఎంతో సీరియస్ అంశం అయిన కరోనా విషయంలో సీఎం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనే కథనాలు ప్రసారం చేశాయి. ప్రభుత్వంలో ఎంతో మంది సలహాదారుల ఉన్నా ఏ ఒక్క అంశాన్ని కూడా స్మూత్ గా డీల్ చేసే పరిస్థితి లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it