Telugu Gateway
Andhra Pradesh

వైరస్ వ్యాప్తి ఆందోళనకరం

వైరస్ వ్యాప్తి ఆందోళనకరం
X

దేశంలో కరోనా వైరస్ ఆందోళనకరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం జనసేన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. “జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొని ఇంట్లోనే ఉండేలా మన నాయకులు, శ్రేణులు అందరికీ అవగాహన కల్పించాలి. ఈ వైరస్ కు ఇప్పటి వరకూ ఇంకా మందు కనిపెట్టలేదు. ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు పాటించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండం లాంటివి అవసరం. ప్రధాని చేసిన సూచనలు అందరూ పాటించాలి. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయాలి. కరోనా మహమ్మారి ప్రమాదకరం అని తెలిసీ ప్రాణాలుపణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది, ఆ విభాగంలో పని చేస్తున్నవారు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

అందుకోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి బయటకు వచ్చి కరతాళ ధ్వనులు ద్వారానో, గంటా నాదం ద్వారా మన కృతజ్ఞత చెప్పుకొందాం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి” అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఇదొక విపత్కర సమయం. ఈ దశలో మనందరం ఒక సామాజిక బాధ్యతగా కరోనా నుంచి విముక్తి పొందే దిశగా పని చేయాలి. దీనిపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రమాదకర పరిస్థితులు నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసమే ప్రయత్నించింది. అప్రమత్తతతో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి” అన్నారు.

Next Story
Share it