వాళ్ళు మళ్ళీ గెలిస్తే ఆస్తులు కూడా మిగలవు
అధికార వైసీపీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతలను జైల్లో పెట్టినా సరే ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు. అదే సమయంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకీ వైసీపీ రాజ్యసభ సీటు ఇవ్వటంపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక రిలయన్స్ కుట్ర ఉందని జగన్ అప్పట్లో ఆరోపించారని, రిలయన్స్ పాత్ర ఉందంటూ ఆ సంస్థ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడుల అంశాన్ని ప్రస్తావించారు. ఈరోజు నత్వానీకి పార్టీ టికెట్లు ఇచ్చి చట్టసభల్లోకి పంపుతున్నారని, పార్టీ టికెట్లు అలా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిజంగానే వైఎస్ మరణం వెనుక రిలయన్స్ పాత్ర లేకపోతే నాడు చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు అధికార అహం వీడాలంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఝలక్ ఇవ్వాల్సిందేనని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు చట్టపరంగా ఎందుకు తగ్గించారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
వైసీపీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ పలు వీడియోలు ప్రదర్శించిన చంద్రబాబు.. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 90శాతం స్థానాలు గెలిపించుకోవడమంటే నిబంధనలు ఉల్లఘించి కండ కావరం ప్రదర్శించటమా? అని సూటిగా ప్రశ్నించారు. లోప భూయిష్ట విధానాలతో బీసీలకు ఎక్కడికక్కడ ప్రాతినిధ్యం తగ్గించారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే ఎన్నికలు అయ్యేవరకు మద్య నిషేధం చేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అధికారులు ఇళ్ల స్థలాల స్లిప్పులు ఇస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రహసనంగా మారిందని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ జరగని ఉల్లంఘనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.