Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో స్థానిక ఎన్నికలు ఆరు వారాలు వాయిదా

ఏపీలో స్థానిక ఎన్నికలు ఆరు వారాలు వాయిదా
X

సంచలనం. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రభావం కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఇది కేవలం వాయిదా మాత్రమే అని..పరిస్థితిని సమీక్షించి తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ యధాతధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలతోపాటు ఇతర అన్ని ప్రక్రియలు అలాగే కొనసాగుతాయని..ఇందులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ భారీ ఎత్తున ప్రజలు గుమిగూడటం, క్యూలో ఉండాల్సి ఉంటుంది కనుక ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరు వారాలు ఎన్నికలు వాయిదా పడినా కూడా కోడ్ అమల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.

పేపర్ బ్యాలెట్ వాడుతున్నందున అధిక సమయం పట్టడంతోపాటు...ప్రజలు ఎక్కువ సమయం క్యూలో నిలుచోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికలు ముఖ్యమే అయినా..ప్రజారోగ్యం కీలకం అయినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఏకగ్రీవాల ద్వారా ఎన్నికల్లో గెలిచిన వారు బాధ్యతలు స్వీకరిస్తారు అని తెలిపారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి సాదారణ పరిస్థితులు వచ్చాక ఎన్నికల కొత్త తేదీలు ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో మాచర్ల, తిరుపతి, పుంగూరు వంటి చోట్ల జరిగిన ఘటనలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని రమేష్ కుమార్ తెలిపారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు తెలిపారు. మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించారు.

Next Story
Share it