ఏపీలో స్థానిక పోరు..నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకున్న అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా తన హవాను కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ప్రతిపక్ష టీడీపీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు జనసేన, బిజెపిలు కలసి స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో ప్రతిపక్షాలకు ఓ సవాల్ గా మారనుంది. అధికార పార్టీ హంగు,అర్భాటలతో సిద్ధంగా ఉన్నా..ప్రతిపక్షాలు మాత్రం ఇక గ్యాప్ లేకుండా రంగంలోకి దిగినా కూడా స్పీడ్ ఊపందుకోవటం కష్టమే. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలుగుదేశం బీసీ నేతలు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు. దీంతో ఏపీ ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఇక పోరుకు రంగం సిద్ధం అయింది.
మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఇక ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిపి, 27న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 27న తొలివిడత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఈ షెడ్యూల్ ను విడుదల చేశాం. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల నియమావళి విధిగా పాటించాలి. ప్రభుత్వానికి సంబంధించిన సదుపాయాలను ఉపసంహరించుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను అమలు చేయరాదు.
కొత్తగా బదిలీలు, నియమాకాలు చేపట్టరాదు. ఎన్నికలు సజావుగా జరపడానికి కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇచ్చాం. స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలి. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్ లో ఉంది కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోం. సిబ్బంది కొరతలేదు.. అత్యవసరం అయితే అంగన్ వాడి వర్కర్స్ ని వాడుకుంటాం’ అని రమేశ్ కుమార్ అన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్ విడుదల
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్
మార్చి 24: ఓట్ల లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
మార్చి 9: నోటిఫికేషన్ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్
మార్చి 15: నోటిఫికేషన్ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్
మార్చి 27: ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్
మార్చి 17: నోటిఫికేషన్ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్
మార్చి 29: ఓట్ల లెక్కింపు