రాష్ట్ర ప్రగతిని ‘రివర్స్’ చేసిన వైసీపీ సర్కారు

జగన్మోహన్ రెడ్డి సర్కారు రివర్స్ టెండర్లు అంటూ రాష్ట్ర ప్రగతిని రివర్స్ చేసిందని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ రాక్షస పాలనను అడ్డుకునేందుకు బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో ప్రతిపక్షంలో ఉండగా నానా యాగీ చేసిన వైసీపీ ఇప్పుడు రహస్య ఒప్పందాలు చేసుకుందని మనోహర్ విమర్శించారు. నవరత్నాల అమలు కోసం పేదల భూముల లాక్కుంటున్నారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ మంగళవారం నాడు విశాఖపట్నంలో విజయనగరం, విశాఖ రూరల్ జిల్లా నాయకుల సమావేశంలో మాట్లాడారు. అదే సమయంలో పార్టీ నేతలకు వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఏడాది కాలంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటంతో పోలవరంతోపాటు రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులు అన్నీ ఆగిపోయాయని అన్నారు. ఇప్పటికే చేసిన పనులకు చెల్లించాల్సిన 1400 కోట్ల రూపాయలను ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిని బహిరంగంగా ఎండగట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. టీడీపీ నేతలు ఇష్టానుసారం దోచుకుంటున్నారని గుంటూరు సభలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
రాజధాని విషయంలో జనసేనపై కొంత దుష్ప్రచారం చేస్తున్నారని..ఈ విషయంలో పార్టీ మొదటి నుంచి ఒకేవైఖరితో ఉందని స్పష్టం చేశారు.పాలన ఒక చోట..అభివృద్ధి అన్ని చోట్ల అన్నదే తమ పార్టీ విధానమన్నారు. రాజధాని పేరుతో భారీ భూసేకరణ చేస్తున్న సమయంలో కూడా తాము రైతుల పక్షానే నిలబడ్డామని..అందుకే తమకు ఈ రోజు అంత గౌరవం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన ఏ మాత్రం పారదర్శకంగా లేదని..మూడు రాజధానుల విషయంలోనూ స్పష్టత కొరవడిందన్నారు. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించి రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీశారన్నారు. రాజధాని అన్నది 29 గ్రామాల సమస్య కాదని..ఇది ఐదు కోట్ల ప్రజల సమస్య అని మనోహర్ వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. త్వరలోనే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు.