వివేకా హత్య కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాబు, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ స్వయంగా పిటీషన్ దాఖలు చేసిన తరుణంలో హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉండగా..ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి వచ్చాక మాత్రం కేసు విచారణ పురోగతిలో ఉన్నందున ఇప్పుడు ఆ అవసరం లేదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వివేకా హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసులో ఏ మాత్రం పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. విచారణలో సమయం ఎంతో కీలకం అయినందున ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది.
పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి విచారణ ప్రారంభించాలని ఆదేశించింది. సీఎం జగన్ పిటీషన్ ఉపసంహరణ ప్రభావం కేసుపై ఉండకూదన్నారు. గత ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకుగురైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు సిట్ లు వేసినా పెద్దగా పురోగతి కన్పించలేదు. కొద్ది రోజుల క్రితం ఈ కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ వివేకా తనయ సునీత, భార్య సౌభాగ్యమలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతే కాదు..తమకు ఎవరెవరిపై అనుమానం ఉందో ఆ పేర్లు కూడా అందులో పేర్కొన్నారు.