Telugu Gateway
Andhra Pradesh

ఆర్ధిక సేవల కోసం కంపెనీ పెడుతున్న జగన్ సర్కారు

ఆర్ధిక సేవల కోసం కంపెనీ పెడుతున్న జగన్ సర్కారు
X

స్టాక్ మార్కెట్లో లిస్ట్ కూడా చేస్తారంట

కార్పొరేషన్లు..యూనివర్శిటీలు, ట్రస్ట్ ల నిధులు దానికే

‘ప్రభుత్వం వ్యాపారం చేయటం ఏంటి?. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా?. అమరావతి కోసం బాండ్స్ తో నిధులు సేకరిస్తారా?.’ ఇవీ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కానీ అధికాంలోకి వచ్చాక మాత్రం సీన్ రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అంటే ఆర్ధిక సేవల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ ఎస్) ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు ..ఈ సంస్థ అవసరం అయితే దేశీయ, విదేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి కూడా నిధులు సేకరిస్తుంది అంట. ఈ విషయాన్ని జీవోలోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సంస్థ ప్రధాన పనులు ఏంటో తెలుసా?. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్లు, ట్రస్ట్ లు,, దేవాదాయ శాఖ, యూనివర్శిటీలు, ఇతర సంస్థలు/బోర్డుల నుంచి నిధులు సేకరిస్తుంది. అంతర్ కార్పొరేట్ డిపాజిట్లు, డిబెంచర్స్/నగదు డిపాజిట్లు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలతో ఈ నిధులు సేకరిస్తుంది. అందరి దగ్గర డబ్బులు తీసుకునే ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలతోపాటు వివిధ పద్దతుల్లో పెట్టుబడులు పెడుతుంది అట. అంతే కాదు..ఇక్కడే ఓ కీలకమైన అంశం ఉంది. అదేంటి అంటే రాష్ట్ర అభివృద్ధి రుణం కింద ఈ సంస్థ ప్రభుత్వానికి నిధులు అందజేయనుంది.

ఇదే అసలు కిటుకు అని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిధుల లేమితో సతమతం అవుతున్న ప్రభుత్వం అందరి దగ్గర నిధులు తీసుకొచ్చి ఈ సంస్థ ద్వారా తన అవసరాలకు వాడుకోనుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అందుకే ఈ కార్పొరేషన్ ఎత్తుగడ వేశారని చెబుతున్నారు. లేకపోతే కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం, ఎక్కువ వడ్డీ మార్గాలను అన్వేషించటం ఏమిటో అర్ధం కావటం లేదని ఓ అధికార వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ రంగ నిపుణులతో నడిచే సంస్థలే సంక్షోభంలో కూరుకుపోతున్నాయని..అలాంటిది ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆర్ధిక లావాదేవీలు నిర్వహించటం ఏమిటో అర్ధం కావటంలేదని ఫైనాన్స్ శాఖ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. పక్కా నిఫుణులతోనే ఈ సంస్థను నడుపుతామని సర్కారు చెబుతున్నా..ఇది అంత తేలికైన వ్యవహారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు ఏమి కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత ఈ సంస్థను దేశ, విదేశాల్లో లిస్టింగ్ కు ప్లాన్ చేశారో అర్ధం కావటంలేదని చెబుతున్నారు. వంద కోట్ల రూపాయల ఆథరైజ్డ్, పెయిడ్ క్యాపిటల్ తో ఈ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సర్కారు ఆదేశించింది.

Next Story
Share it